ట్రైబ్యునల్ తేల్చితేనే పాలమూరు-రంగారెడ్డి!
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:15 AM
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఆశలు అడుగంటే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌ను పరిశీలించడానికి కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) విముఖత చూపుతోంది.
డీపీఆర్ పరిశీలనకు సీడబ్ల్యూసీ మళ్లీ విముఖత
‘పోలవరం’ వాటా 45 టీఎంసీలపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం తప్పదని వెల్లడి
మైనర్ ఇరిగేషన్‌లో 45టీఎంసీల
పొదుపు ప్రతిపాదనపై అసంతృప్తి
ఎత్తిపోతలపై అడుగంటుతున్న ఆశలు
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఆశలు అడుగంటే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌ను పరిశీలించడానికి కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) విముఖత చూపుతోంది. ఇప్పటికే రెండుసార్లు ఈ డీపీఆర్‌ను వెనక్కి పంపిన సీడబ్ల్యూసీ.. తాజాగా దానిని పరిశీలించలేమని తేల్చిచెప్పింది. ఇటీవలే రాష్ట్రం తరఫున కీలక బృందం న్యూఢిల్లీకి వెళ్లి.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమై పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌ను పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. అయితే సీడబ్ల్యూసీ మాత్రం కుదరదని ఖరాఖండిగా చెప్పేసింది. ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటి కేటాయింపుపైనే ప్రధానంగా అభ్యంతరాలున్నాయి.
కృష్ణా బేసిన్‌లోని మైనర్ ఇరిగేషన్‌లో 2012-13 నుంచి 2021-22 దాకా 45.66 టీఎంసీల నీటిని పొదుపు చేశామని డీపీఆర్‌లో తెలంగాణ పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుకు అనుమతి లభిస్తే.. ఆ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవాలనే ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలను పాలమూరుకు కేటాయించారు. ఇలా పాలమూరు-రంగారెడ్డికి మొత్తం 90 టీఎంసీలను తెలంగాణ ప్రతిపాదించింది. అయితే మైనర్ ఇరిగేషన్‌లో 45 టీఎంసీల నీటిని ఏ విధంగా పొదుపు చేశారో చెప్పాలని సీడబ్ల్యూసీ కోరింది. ఈ వివరాలను అధికారులు సమర్పించినా.. వాటితో సీడబ్ల్యూసీ సంతృప్తి చెందలేదు. మరోవైపు పోలవరం వాటాలో దక్కిన 45 టీఎంసీలను పంచే బాధ్యతను జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ (కృష్ణా ట్రైబ్యునల్-2)కు అప్పగించడంతో.. ట్రైబ్యునల్ నీటి కేటాయింపులు చేసే వరకు, లేదా రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితే తప్ప.. ఆ నీటిపై ఎవరికీ హక్కు లేదని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చిచెప్పింది.
ఇవి కూడా చదవండి...
మ్యూల్ ఖాతాలిచ్చే వారిలో చదువుకున్నోళ్లే ఎక్కువ
దాహం తీరడానికి ప్రైవేటు నీళ్లే కావాలా?
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘4ఈ’ అస్త్రం
Read Latest AP News And Telugu News