Share News

బీఆర్ఎస్ ఓ పెద్ద జోక్ వేసింది: బండి సంజయ్

ABN , Publish Date - Jan 25 , 2026 | 07:08 PM

ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఛానెల్‌ను బీఆర్ఎస్ పార్టీ నిషేధించడం పెద్ద జోక్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎన్నడో నిషేధించారని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ ఓ పెద్ద జోక్ వేసింది: బండి సంజయ్
Bandi Sanjay Kumar

హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్-ఆంధ్రజ్యోతి (ABN - Andhrajyothy) ఛానెల్‌ను నిషేధిస్తున్నట్లు బీఆర్ఎస్ (BRS) పార్టీ ప్రకటించడం పెద్ద జోక్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎన్నడో నిషేధించారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అడుగులకు మడుగులొత్తే అనుకూల మీడియా మాదిరిగానే ఇతర మీడియా ఉండాలనుకోవడం మూర్ఖత్వమని మండిపడ్డారు. బీఆర్ఎస్ అనుకూల మీడియాలో మాట్లాడినట్లుగానే... ఇతర మీడియాలో మాట్లాడతానంటే ఎలా? అని ప్రశ్నించారు కేంద్రమంత్రి. ఏబీఎన్ టీవీ చర్చలో హద్దు దాటిందెవరు..? సరిదిద్దాలని అనుకుందెవరు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అభ్యతరకరంగా బీఆర్ఎస్ నేత దూషించడం తప్పు కాదా? అని నిలదీశారు. ఆ పదాన్ని వెనక్కు తీసుకోవాలని ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కోరినా వినకుండా.. మూర్ఖంగా వ్యవహరించడం హుందాతనం ఎలా అవుతుందని ప్రశ్నించారు.


అడ్డగోలుగా మాట్లాడుతారా..

ఇష్టమొచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడటం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని బండి సంజయ్ కుమార్ సెటైర్లు గుప్పించారు. ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఛానల్‌ను బహిష్కరించడం కూడా వాళ్ల వంతేనా..? అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు ఏం చేసినా తలూపడానికి తెలంగాణ ప్రజలు ఏం తెలియని వారని అనుకుంటున్నారా.. అని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కర్రు కాల్చి వాత పెట్టినా సిగ్గు రాలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్కటంటే ఒక్క సీటు ఇవ్వకుండా చెంప చెళ్లుమనేలా తీర్పునిచ్చిన సంగతి మరిచారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పక్షాన పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా ముందుకు రాక ఎలక్షన్స్‌కు ముందే చేతులెత్తేసినా బుద్ది మారదా? అని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన తప్పులను, అవినీతిని ఒప్పుకోకుండా టీవీ డిబేట్లలో, మీడియా సమావేశాల్లో శ్రుతి మించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించాలా? అని ధ్వజమెత్తారు.


అందులో తప్పేముంది...

అభ్యంతరకరంగా మీడియాను దూషించడం బీఆర్ఎస్ దృష్టిలో కరెక్టా..? అని బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఆ పదాన్ని వెనక్కు తీసుకోవాలని పదేపదే కోరినా వినకుండా అడ్డగోలుగా మాట్లాడుతుంటే.. ‘‘గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్’’ అని ఏబీఎన్ ఛానల్ ప్రతినిధి అనడంలో తప్పేముంది? అని ప్రశ్నల వర్షం కురిపించారు. నిజం మాట్లాడితే వ్యక్తిత్వ హననం చేస్తున్నారంటూ... కూని రాగాలు పాడటం బీఆర్ఎస్ నేతలకు అలవాటైందని విమర్శించారు. వ్యక్తిత్వమే లేని బీఆర్ఎస్ నేతలు ‘వ్యక్తిత్వ హననం’ గురించి మాట్లాడటం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. అవినీతి, అక్రమాలు చేయడంలోనే కాదని.. అభ్యంతరకరంగా మీడియాను తమ చేతల్లో ఉంచుకోవాలని అనుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరితేరిపోయాయని దెప్పిపొడిచారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారనే సోయి కూడా లేకుండా మాట్లాడితే... రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడు: హరీశ్‌రావు

జాగృతి పార్టీలో చేరండి.. మహేశ్ గౌడ్‌కు కవిత ఆఫర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 25 , 2026 | 08:21 PM