జాగృతి పార్టీలో చేరండి.. మహేశ్ గౌడ్‌కు కవిత ఆఫర్
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:27 PM
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక సూచన చేశారు. మహేశ్ కుమార్ గౌడ్‌ను జాగృతిలోకి ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు (Mahesh Kumar Goud) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) కీలక సూచన చేశారు. మహేశ్ కుమార్ గౌడ్‌ను జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. జాగృతిలో చేరితే ఆయనకు మంచి పోస్ట్ ఇస్తానంటూ ఆఫర్ చేశారు. ఆదివారం నాడు హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో కవిత మాట్లాడారు.
కాంగ్రెస్ ఓడిపోయే పార్టీ..
తనను కాంగ్రెస్‌లో చేర్చుకోమని టీపీసీసీ అధ్యక్షుడు అంటున్నారని కవిత అన్నారు. అసలు తానేందుకు కాంగ్రెస్‌లో చేరతాను..? అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయే పార్టీ అని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో జాగృతి గెలువబోతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తనను బద్నాం చేసే పనిలో మహేశ్ గౌడ్ ఉన్నారని ఆరోపించారు. తాను కాంగ్రెస్‌లో చేరతానని మహేశ్ కుమార్ గౌడ్‌కు కల వచ్చిందా..? అని ఎద్దేవా చేశారు. ఆయన మానసిక పరిస్థితి చెక్ చేసుకోవాలని హితవు పలికారు. బలమైన రాజకీయ పార్టీగా జాగృతిని మార్చే ప్రయత్నం చేస్తున్నానని కవిత పేర్కొన్నారు.
సృజన్‌రెడ్డికి కాంట్రాక్ట్‌లు ఇప్పించిందే హరీశ్‌రావు...
మాజీ మంత్రి హరీశ్‌రావు టార్గెట్‌గా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. 'సృజన్ రెడ్డికి కాంట్రాక్టులు ఇప్పించింది హరీశ్‌రావే. సృజన్‌రెడ్డి పెద్ద తిమింగలంగా మారటానికి ఆయనే కారణం. సృజన్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డి బావమరిది అని హరీశ్‌రావుకు అప్పుడు తెలియదా..?. ఆయన తవ్విన గుంతలో మాజీ మంత్రి కేటీఆర్ పడటం బాధాకరం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు లేఖ రాయనని హరీశ్‌రావు అనటం దళిత ఉప ముఖ్యమంత్రిని అవమానించటమే. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మాత్రమే లేఖ రాస్తానని హరీశ్‌రావు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడగకుండా రాష్ట్రానికి సీబీఐ ఎలా వస్తుంది..?. సీనియర్ అయిన హరీశ్‌రావుకు ఈవిషయం తెలియదా?. 2014 నుంచి జరిగిన సింగరేణి టెండర్లపై విచారణ జరపాలని ఆయన అంటున్నారు. అంటే కేసీఆర్ పాలనపైనా హరీశ్‌రావు విచారణ కోరుతున్నట్లే కదా..?’ అని కవిత ప్రశ్నల వర్షం కురిపించారు.
హరీశ్‌రావు బాధ కమీషన్ల కోసమే..
‘హరీశ్‌రావు లేఖ రాయగానే కిషన్‌రెడ్డి మీటింగ్ పెడుతున్నారు. హరీశ్‌రావు బాధ అంతా ఆయన కమీషన్ల కోసమే. ఆయనకు చెందిన కంపెనీకి సింగరేణి టెండర్ ఎలా వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బొగ్గు గనులను తెలంగాణకు కేటాయించటానికి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలి. బీఆర్ఎస్ కాంట్రాక్టర్ల పక్షాన మాట్లాడటం బాధాకరం. జీతాలు ఇవ్వటానికి కూడా సింగరేణి వద్ద నిధులు లేవు. జాగృతి రెండేళ్లుగా సింగరేణి టెండర్‌లపై మాట్లాడుతుంటే భట్టి విక్రమార్క కనీసం స్పందించలేదు. సింగరేణికి చెందిన 25టెండర్లలో ఎక్కువ బీఆర్ఎస్ నేతలకు చెందిన కంపెనీలకే దక్కాయి. ఓబీ వర్క్స్‌కు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తీసుకురావడం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు. సింగరేణి కార్మికుల కోసం జాగృతి పోరాటం చేస్తుంది’ అని కవిత స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడు: హరీశ్‌రావు
ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి
Read Latest Telangana News And Telugu News