Actress Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. ఎందుకంటే..
ABN , Publish Date - Jan 16 , 2026 | 06:24 PM
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చేసిన ఫిర్యాదు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, పరువు నష్టం కలిగించే పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు.
హైదరాబాద్, జనవరి16 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నటి, టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్(Actress Anasuya Bharadwaj) సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం సినీ, సోషల్ మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్, వ్యక్తిత్వ హననం(Character Assassination), అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారంటూ ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. గతేడాది డిసెంబర్ 23వ తేదీ నుంచి తనపై ఆన్‌లైన్ వేధింపులు పెరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు వివరాలు, నిందితుల జాబితా..
నిందితుల పేర్లతో పాటు సోషల్ మీడియా లింకులు ఫిర్యాదుతో జత చేశారు అనసూయ. సోషల్ మీడియాలో తనపై క్యాంపెయిన్ తరహాలో దాడి జరిగిందని చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయం చెప్పిన తర్వాతే ఈ వేధింపులు మొదలయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అశ్లీల వ్యాఖ్యలు, లైంగిక దూషణలు, బెదిరింపులు జరిగాయని ఫిర్యాదులో వెల్లడించారు. క్రిమినల్ డెఫమేషన్, వ్యక్తిగత వేధింపులు, ఏఐ ఫోర్జరీ వంటి నేరాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. అనసూయ ఫిర్యాదుతో మొత్తం 42 మందిపై కేసు నమోదైంది. కొందరు వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఖాతాదారులపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఎవరివెవరిపై కేసులు..
సీనియర్ నటి కరాటే కల్యాణి, ప్రముఖ రేడియో జాకీ(RJ) శేఖర్ బాషా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని, పావని, రజిని, నటి విజయలక్ష్మి, ఒక ప్రముఖ ఛానల్ యాంకర్ రోహిత్, మరికొందరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు, యాంకర్లు ఉన్నారు. వీరు వివిధ సోషల్ మీడియాల వేదికగా విమర్శలు చేశారని అనసూయ ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుకు కారణాలు..
తన ఫొటోలను మార్ఫింగ్ చేయడం, తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు రూపొందించడం, తన వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు కంటెంట్ క్రియేటర్లు వ్యూస్ కోసం కించపరిచేలా మాట్లాడుతున్నారని అనసూయ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో గ్రూపులుగా ఏర్పడి తనను మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పదజాలం వాడటం, వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు, మహిళగా తన గౌరవాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టడం, వీడియోలు చేయటం, ట్రోలింగ్ పేరుతో మానసిక వేధింపులకు గురిచేయటం, ఉద్దేశపూర్వకంగా పరువు నష్టం కలిగించే ప్రచారం చేయడం వంటి చర్యలు తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఫిర్యాదులో రాసుకొచ్చారు అనసూయ.
చట్టపరమైన చర్యలు..
సైబరాబాద్ పోలీసులు ఐటీ యాక్ట్(IT Act), సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. డిజిటల్ సాక్ష్యాలను(వీడియోలు, పోస్టులు, స్క్రీన్‌షాట్లు) పోలీసులు ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది. నేరం రుజువైతే జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పలువురు ప్రముఖుల పేర్లు ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది.
సైబర్ క్రైం పోలీసుల చర్య..
అనసూయ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, కామెంట్లను పరిశీలించిన అనంతరం.. ఐటీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా నిందితులకు నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని, న్యాయపరమైన పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసులతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సెలబ్రిటీలకు సైబర్ భద్రత అవసరం..
ఈ ఘటన సెలబ్రిటీలపై జరుగుతున్న విష ప్రచారాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చిందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలు పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మహిళలపై ఆన్‌లైన్ వేధింపులకు ఇది గట్టి సందేశమని.. సెలబ్రిటీలైనా సరే చట్టపరంగా రక్షణ అవసరమని పేర్కొన్నారు. ట్రోలింగ్‌కు హద్దులు ఉండాలని.. విమర్శకు, దూషణకు తేడా తెలుసుకోవాలని పలువురు ప్రముఖులు చెబుతున్నారు. సోషల్ మీడియా వినియోగంలో బాధ్యత అవసరమని అంటున్నారు. సోషల్ మీడియాలో 'ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్' పేరుతో ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లడం, మహిళలను కించపరచడం వంటి చర్యలపై ఈ కేసు ఒక హెచ్చరికగా నిలవనుంది. ముఖ్యంగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వ్యూస్ పెంచుకునే 'యూట్యూబ్ థంబ్‌నైయిల్' సంస్కృతికి ఇది అడ్డుకట్ట వేయనుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి...
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి తుమ్మల
కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదు: మంత్రి సీతక్క
Read Latest Telangana News And Telugu News