సీఎన్‌జీ గ్యాస్ కోసం 2 కి.మీ క్యూ
ABN , Publish Date - Mar 31 , 2026 | 10:10 AM
ఆటోలలో సీఎన్‌జీ గ్యాస్ నింపుకునేందుకు డ్రైవర్లు సోమవారం నానా తంటాలు పడ్డారు.
లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్ గల్లీల్లోకి..
గంటల కొద్ది వేచి ఉండాల్సిన పరిస్థితి
హైదరాబాద్: ఆటోలలో సీఎన్‌జీ గ్యాస్ నింపుకునేందుకు డ్రైవర్లు సోమవారం నానా తంటాలు పడ్డారు. లక్డీకాపూల్‌లోని గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో గ్యాస్ అందుబాటులో ఉందన్న సమాచారం మేరకు నగరవ్యాప్తంగా వందలాది మంది ఆటో డ్రైవర్లు ఇక్కడికి చేరుకోవడంతో భారీ రద్దీ ఏర్పడింది. అశోక హోటల్ సమీపంలోని భారత్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ నుంచి పాత సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ చౌరస్తా మీదుగా రాజ్‌దూత్ చౌరస్తా, సెన్సేషన్ సినిమా థియేటర్, పాత మల్లయ్య హోటల్,
లక్ష్మీనగర్ నుంచి ఖైరతాబాద్ మార్కెట్ చౌరస్తా మీదుగా భారీ గణపతి విగ్రహం, ఆ ముందు నుంచి ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్ లోపల మూడు వీధుల మీదుగా క్యూలు కట్టడంతో ఖైరతాబాద్ ప్రజలు విస్తుపోయారు. ఎక్కడ చూసినా ఆటోల క్యూ కనిపించడంతో సందడిగా మారింది. పలు చౌరస్తాలలో ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధ్దీకరించారు. అక్కడక్కడ ఆటోవాలాలు మధ్య నుంచి దూరేందుకు ప్రయత్నించడంతో గొడవలు జరిగాయి. దీనిని గమనించిన ట్రాఫిక్ పోలీసులు సైఫాబాద్ పాత పోలీస్‌స్టేషన్ వద్ద ట్రాఫిక్ నిలిపిన సమయంలో సులువుగా వెళ్లేందుకు టోకెన్లను పంపిణీ చేశారు.
దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఆటోలు క్యూ కట్టడంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరోవైపు చాలాచోట్ల ఆటోలలో గ్యాస్ నింపుకునే బంక్‌లు మూసివేయడం, లక్డీకాపూల్‌లో భారత్ పెట్రోల్ బంక్ ఒక్క దాంట్లో మాత్రం రెండు ట్యాంకర్ల ద్వారా 9800 కిలోల గ్యాస్ రావడంతో రద్దీ ఎక్కువైంది. అందరికీ కనీసంగా గ్యాస్ అందాలనే ఉద్దేశంతో పోలీసులు ప్రతీ ఆటోకు రూ.700కు 9 కిలోల గ్యాస్‌ను నింపే వసతి కల్పించారు పోలీసులు. 1,080 ఆటోలకు గ్యాస్ అందించింది.
రాకపోకలకు తీవ్ర అంతరాయం
లక్డీకాపూల్ ప్రధాన రహదారి నుంచి ఖైరతాబాద్ భారీ గణపతి రోడ్డు నుంచి దాదాపు ప్రధాన వీధులన్నీ ఆటోలతో నిండిపోవడంతో స్థానికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కూరగాయలు, మార్కెట్ నుంచి వస్తువులు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చే వారు నడుచుకుంటూ వెళ్లాలంటేనే చాలా సమయం పట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎంఎల్‌ఎం మోసగాళ్లకు పదేళ్ల జైలు
దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయింది: హోంమంత్రి అమిత్ షా
Read Latest Telangana News and National News