Share News

దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయింది: హోంమంత్రి అమిత్‌ షా

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:13 AM

దేశంలో నక్సలిజం దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. సమాజంలో జరిగే అన్యాయాలకు రాజ్యాంగంలో పరిష్కార మార్గాలున్నాయని, ఆ మార్గాలను వదిలి ఆయుధాలు చేపట్టడం సరి కాదని అన్నారు.

దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయింది: హోంమంత్రి అమిత్‌ షా

  • సల్వాజుడుం కేసులో జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి తీర్పుతో అనేకమంది మృతి

  • ఆయన తన వ్యక్తిగత ఎజెండాకు రాజ్యాంగ ముసుగు వేశారు

  • కాంగ్రెస్‌ హయాంలోనే నక్సలిజం ఉధృతి

  • సానుభూతిపరులతో రాహుల్‌కు లింక్‌

  • హైదరాబాద్‌లో గద్దర్‌తో భేటీ అయ్యారు

  • మావోయిస్టుల ఏరివేతలో తెలంగాణ పోలీసుల సహకారం మరువలేనిది

  • లోక్‌సభలో హోంమంత్రి అమిత్‌ షా

న్యూఢిల్లీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): దేశంలో నక్సలిజం దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. సమాజంలో జరిగే అన్యాయాలకు రాజ్యాంగంలో పరిష్కార మార్గాలున్నాయని, ఆ మార్గాలను వదిలి ఆయుధాలు చేపట్టడం సరి కాదని అన్నారు. దేశంలో వామపక్ష తీవ్రవాదంపై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయుధాలు దించిన వారితోనే కేంద్రం చర్చలు జరుపుతుందని స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిన వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని చెప్పారు. పేదరికం వల్ల కాకుండా సిద్ధాంతం ద్వారా నక్సలిజం వ్యాపించిందని తెలిపారు. 1970లో రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు ఇందిరాగాంధీ నక్సల్స్‌ సిద్ధాంతాన్ని సమర్థించారని ఆరోపించారు. బస్తర్‌లో నక్సలిజాన్ని దాదాపు నిర్మూలించామని, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుకుంటున్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ పాఠశాల, రేషన్‌ షాపులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రతి ఒక్కరికీ 5 కిలోల ఆహారధాన్యాలు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 4,839 మంది నక్సలైట్లు లొంగిపోయారని, 2,218 మందిని జైలుకు పంపామని వెల్లడించారు. లొంగిపోవడానికి నిరాకరించిన 706 మందిని పోలీసులు ఎన్‌ కౌంటర్లలో హతమార్చారని చెప్పారు. దేశంలో కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాదం కంటే నక్సలిజమే అత్యంత ప్రమాదకరమనియూపీఏ హయాంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అన్నప్పటికీ నక్సలిజం నిర్మూలనకు ఆచరణలో చేసిందేమీ లేద అమిత్‌షా విమర్శించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం మావోయిజాన్ని నిర్మూలించేందుకు కృతనిశ్చయంతో ఉన్నదని, అందుకే మార్చి 31 వరకు డెడ్‌లైన్‌ విధించి కఠిన చర్యలు తీసుకుందని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలోనే మావోయిస్టు హింసాకాండ పెరిగి, అర్బన్‌ నక్సలైట్లు కూడా విస్తరించారని విమర్శించారు. నక్సలిజం వల్ల 20 వేలమంది యువకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కాంగ్రెస్‌ వల్లే ఆదివాసీలు, ఇతర జాతులు అభివృద్ధికి నోచుకోక నక్సలిజానికి ఆకర్షితులయ్యారని విమర్శించారు. 60 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ గిరిజనులను ఎందుకు అభివృద్థి చేయలేదని ప్రశ్నించారు.


జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి తీర్పుతో అనేక ప్రాణాలు బలి

సల్వాజుడుం కేసులో 2011లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి నక్సల్స్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వటంతో, ఆ తర్వాత సల్వాజుడుంలో పాల్గొన్న వారంద రినీ నక్సలైట్లు చంపేశారని అమిత్‌ షా అన్నారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్‌ పార్టీ ఉప రాష్ట్రపతిగా నిలబెట్టిందని విమర్శించారు. రూల్‌ ఆఫ్‌ లా, శాంతిభద్రతలు కాపాడడంలో విశ్వాసం ఉన్న ఏ పార్టీ కూడా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి వంటివారిని అభ్యర్థిగా నిలబెట్టదని అన్నారు. ‘సల్వాజుడుం 2005లో ప్రభుత్వ మద్దతుతో ఒక ప్రజా ఉద్యమంగా ప్రారంభమైంది. ఆదివాసీ యువకులను ఎస్పీవోలుగా నియమించారు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారిని ఎదుర్కోవడానికి వీరికి శిక్షణ ఇచ్చారు. సల్వాజుడుంను ఏ బీజేపీ కార్యకర్తో ప్రారంభించలేదు. కాంగ్రెస్‌ నాయకుడు శ్రీమాన్‌ కర్మ ప్రారంభించారు. నక్సలైట్లు ఆయనను దారుణంగా చంపివేశారు. నక్సలైట్లపై ప్రభుత్వం చేస్తున్న పోరాటం చట్ట విరుద్ధమని జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం 2011, జూలై 5న తీర్పు చెప్పి, ఎస్పీవోల వద్ద ఉన్న ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. దీనివల్ల ఏం జరిగింది? వీరి వద్ద ఉన్న ఆయుధాలను వెనక్కి తీసుకున్నారు. కానీ, నక్సలైట్ల చేతుల్లో ఆయుధాలు అలాగే ఉన్నాయి. వారు సల్వాజుడుంతో సంబంధం ఉన్న వారిని ఏరికోరి చంపేశారు. అదే సుదర్శన్‌రెడ్డి ఆ తర్వాత విపక్షాల తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయ్యారు. మాకు నక్సలైట్లతో సంబంధం ఏముందని కాంగ్రెస్‌ పార్టీ అంటోంది. ఇదే ఆ సంబంధం. మన న్యాయ వ్యవస్థలోని న్యాయమూర్తులు తటస్థంగా ఉంటారని నమ్ముతాం. అది మన న్యాయ వ్యవస్థకు ఆత్మ. కానీ, ఒక వ్యక్తి న్యాయమూర్తి అయ్యాక తన వ్యక్తిగత భావజాలాన్ని ఉపయోగిస్తూ, దానికి రాజ్యాంగ ముసుగు వేసి, ప్రజల ప్రాణాలు పోయేలా తీర్పులు ఇచ్చారు. అటువంటి తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నాను. వారికి ఓటు వేసి అభ్యర్థిగా నిలబెట్టిన వారిని కూడా ఖండిస్తున్నాను. భావజాలం ప్రజల క్షేమాన్ని హరించేదిగా ఉండకూడదు’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఆయుధాలు చేపట్టే వారి పట్లనే మానవత్వం ప్రదర్శించడం సరైంది కాదని, నక్సల్స్‌ దాడుల్లో మరణించిన సాధారణ ప్రజలకు మానవత్వం వర్తించదా? అని ఆయన ప్రశ్నించారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని అర్బన్‌ నక్సల్స్‌ రాసిన వేలాది వ్యాసాలను తాను గత ఆరు రోజులుగా చదివానని, నక్సల్స్‌ దాడిలో చనిపోయిన ఎంతోమంది అమాయకులపై ఎందుకు వ్యాసాలు రాయలేదని నిలదీశారు. వారి ప్రాణాలకు విలువ లేదా? అని ప్రశ్నించారు. రష్యా కమ్యూనిస్టు పార్టీ ప్రేరణతో 1969లో ఏర్పడ్డ సీపీఐ(ఎంఎల్‌) సాయుధ పోరాటాన్ని ప్రారంభించిందని, విదేశీ ప్రేరణతో ఏర్పడిన పార్టీ మనదేశంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు.


భద్రతా బలగాల పోరాటం అద్భుతం

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌’ గురించి అమిత్‌ షా సభలో వివరించారు. ‘సుమారు 50 కిలోమీటర్ల పొడవు, 37 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక కొండపై మావోయిస్టులు ఏకంగా ఒక శాశ్వత క్యాంపును ఏర్పాటు చేసుకున్నారు. 400 నుంచి 500 మంది మావోయిస్టులు ఉన్న ఆ క్యాంపుపై ఎండలు మండిపోయే సమయంలో మన భద్రతా బలగాలు వీరోచితంగా దాడి చేశాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో రోజుకు కేవలం 300 గ్రాముల నీటితో జవాన్లు 21 రోజుల పాటు ఈ ఆపరేషన్‌ను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్‌తో బస్తర్‌, తెలంగాణ ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలింది. ఈ ఆపరేషన్‌లో కోబ్రా, సీఆర్పీఎఫ్‌ దళాలతో పాటు స్థానిక పోలీసుల పోరాటం మరువలేనిది’ అని కొనియాడారు. ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ‘గ్రేహౌండ్స్‌’ పాత్ర గురించి సభలో ప్రస్తావించగా.. అమిత్‌ షా స్పందించారు. ‘తెలంగాణ ప్రభుత్వం తమ బలగాలను కొండపైకి పంపలేమని.. కానీ, మావోయిస్టులు కిందకు వేస్త మాత్రం కచ్చితంగా అడ్డుకుంటామని తెలిపింది. కొండ దిగి వస్తున్న మావోయిస్టులను సమర్థవంతంగా అడ్డుకున్నందుకు వారికి ధన్యవాదాలు’ అని అమిత్‌ షా అన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీలో ప్రస్తుతం మావోయిస్టుల ప్రాతినిధ్యం శూన్యమని చెప్పారు.

మావోయిస్టు సానుభూతిపరులతో రాహుల్‌ గాంధీ భేటీ

కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అమిత్‌ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్‌గాంధీ తన రాజకీయ ప్రయాణంలో అనేకసార్లు నక్సల్స్‌, వారి సానుభూతిపరులతో వేదికలు పంచుకున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే 2018లో హైదరాబాద్‌లో వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉండే గుమ్మడి విఠల్‌ రావు అలియాస్‌ ‘గద్దర్‌’తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారని తెలిపారు. నక్సలిజాన్ని పరోక్షంగా ప్రోత్సహించే వారితో కాంగ్రెస్‌ నేతలు అంటకాగడం వల్లే ఇన్నేళ్లుగా వామపక్ష తీవ్రవాదం పేట్రేగిపోయిందని విమర్శించారు.

Updated Date - Mar 31 , 2026 | 06:02 AM