Share News

శ్మశానవాటికలో సిలిండర్లు దాచి బ్లాక్‌లో విక్రయం!

ABN , Publish Date - Mar 31 , 2026 | 09:02 AM

అమెరికా - ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో దేశంలో వాణిజ్య సిలిండర్లకు విపరీతంగా కొరత ఏర్పడింది. దాంతో ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్ల సరఫరాను చాలా ప్రాంతాల్లో నిలిపివేశాయి.

శ్మశానవాటికలో సిలిండర్లు దాచి బ్లాక్‌లో విక్రయం!

  • 10 మంది అరెస్టు, 414 వాణిజ్య సిలిండర్లు సీజ్‌

  • ఏ తప్పూ చేయలేదంటూ మీడియా ముందు నిందితుడి హల్‌చల్‌

హైదరాబాద్‌ సిటీ: అమెరికా - ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో దేశంలో వాణిజ్య సిలిండర్లకు విపరీతంగా కొరత ఏర్పడింది. దాంతో ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్ల సరఫరాను చాలా ప్రాంతాల్లో నిలిపివేశాయి. ఇదే అదనుగా భావించిన కొంతమంది గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు వాణిజ్య సిలిండర్లను రహస్య ప్రాంతాల్లో డంప్‌ చేసి బ్లాక్‌లో విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు(Task Force Police) దాడి చేసి ఆ ముఠా గుట్టు రట్టు చేశారు. 10 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 414 వాణిజ్య సిలిండర్లను సీజ్‌ చేశారు.


10 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మహ్మద్‌ అమీర్‌ శంషాబాద్‌ కేంద్రంగా.. మెట్రో గ్యాస్‌ పేరుతో ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. బంజారాహిల్స్‌ నాగార్జున ఎక్స్‌రోడ్డు సమీపంలో ఒక శ్మశాన వాటికలో తనకు సరఫరా అయిన వాణిజ్య సిలిండర్లను డంప్‌ చేస్తున్నాడు. అవసరమైన వారికి బ్లాక్‌లో ఒక్కో సిలిండర్‌ను రూ. 6 వేలకు విక్రయిస్తున్నాడు. శ్మశానవాటికలో నిల్వ ఉంచినందుకు గాను నెలకు రూ. 5వేలు అద్దె చెల్లిస్తున్నాడు.


city4.2.jpgవిశ్వసనీయ సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ యుగేందర్‌ ఎస్‌ఐ రవిరాజ్‌తో పాటు బంజారాహిల్స్‌ పోలీసుల సాయంతో శ్మశానంలో దాడులు జరిపారు. ప్రధాన నిందితుడు అమీర్‌(42)తో పాటు గ్యాస్‌ డెలివరీ బాయ్‌లు మహ్మద్‌ యూసుఫ్‌, మహ్మద్‌ ఇస్మాయిల్‌, ఎ. రామారావు, లోక్‌ కుమార్‌, మహ్మద్‌ సక్కుద్దీన్‌(కూలీ), మహ్మద్‌ మంతాజ్‌ అన్సారీ(వ్యాన్‌ డ్రైవర్‌), మహ్మద్‌ మినాజ్‌ అన్సారీ(కూలీ), రాజేష్‌ పాల్‌(లారీ డ్రైవర్‌) అదేవిధంగా రామ్‌రాజ్‌ సింగ్‌లను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.21.88 లక్షలు ఉంటుందని డీసీపీ తెలిపారు.


కాగా సిలిండర్ల అక్రమ విక్రయాలపై సికింద్రాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను కూర్చోబెట్టి డీసీపీ వివరిస్తుండగా... ఓ ప్రధాన నిందితుడు పైకి లేచి తాను ఏ తప్పు చేయలేదని.. కావాలనే కేసులో ఇరికించారంటూ ఒక్కసారిగా కేకలు వేయడంతో అవాక్కైన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతడిని ఆగ్రహంతో పక్కకు తీసుకెళ్లిపోయారు. బంజారాహిల్స్‌ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎంఎల్‌ఎం మోసగాళ్లకు పదేళ్ల జైలు

దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయింది: హోంమంత్రి అమిత్‌ షా

Read Latest Telangana News and National News

Updated Date - Mar 31 , 2026 | 09:31 AM