మంచిర్యాలలో ఆటోను ఢీకొన్న లారీ.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:39 AM
మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు.
మంచిర్యాల, సెప్టెంబర్ 28: జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..
స్థానికులు, బాధితుల వివరాల ప్రకారం.. జిల్లాలోని నస్పూర్ నుంచి మంచిర్యాల కేంద్రం వైపు వెళ్తున్న ఓ లారీ నస్పూర్ గేటు వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించారు. ముగ్గురు ప్రయాణికులు ప్రాణాపాయస్థితిలో ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో మృతి చెందిన వారిని మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామానికి చెందిన అత్తలి సౌందర్య, చింతకుంట లక్ష్మిగా గుర్తించారు. బాధితులంతా జిల్లా కేంద్రంలోని షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. విధులకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ప్రమాదం జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా.. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను నస్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి...
రంగారెడ్డి జిల్లాలో జింక మాంసం పట్టివేత.. 8 మంది అరెస్ట్
Read Latest AP News And Telugu News