ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం
ABN , Publish Date - Sep 28 , 2026 | 07:05 AM
దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ఓర్వలేక ప్రతిపక్ష నేతలు, మేధావుల పేరుతో కొంతమంది ఓటు చోరీ అంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.
‘సర్’పై ఈసీ ప్రెస్‌నోట్‌ను అందరూ చదవాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
పెదవాల్తేరు (విశాఖపట్నం), సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ఓర్వలేక ప్రతిపక్ష నేతలు, మేధావుల పేరుతో కొంతమంది ఓటు చోరీ అంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఆదివారం ఇక్కడ బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీపై చేస్తున్న ప్రతి ఆరోపణకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ‘సర్’పై ఎన్నికల సంఘం ఇచ్చిన పూర్తి ప్రెస్‌నోట్‌ను ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలతో పాటు సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను తీవ్రంగా తప్పుబట్టారు. అసత్య ప్రచారాలతో ప్రజలను పక్కదారి పట్టించవద్దని హెచ్చరించారు. దేశంలో ఓటర్ల జాబితా తయారీ, సవరణకు పటిష్ట వ్యవస్థ ఉందన్నారు. ఇంత పెద్ద వ్యవస్థలో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నప్పటికీ.. దానిని ఓటు చోరీగా అభివర్ణించడం తగదని హితవు పలికారు. గతంలో బీజేపీకి కొన్ని రాష్ట్రాల్లో పరాజయాలు ఎదురైన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రజల తీర్పును తమ పార్టీ గౌరవిస్తుందని పేర్కొన్నారు.