జగిత్యాల జిల్లాలో వీధి కుక్కల దారుణ హత్య
ABN , Publish Date - Jan 24 , 2026 | 09:17 PM
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో దారుణం జరిగింది. సుమారు 80కి పైగా వీధి కుక్కలు మృత్యువాతపడ్డాయి. మత్తు ఇంజక్షన్ల ద్వారా వీటిని హతమార్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
జగిత్యాల జిల్లా, జనవరి24 (ఆంధ్రజ్యోతి): పెగడపల్లి మండల కేంద్రంలో దారుణ ఘటన జరిగింది. సుమారు 80కి పైగా వీధి కుక్కలను అమానుషంగా హతమార్చారు. గత కొన్ని రోజులుగా ఆ ఊర్లో వీధి కుక్కల సంఖ్య పెరిగిందని, వాటిని నియంత్రించాలనే సాకుతో స్థానిక పంచాయతీ అధికారులే.. వాటికి మత్తు ఇంజక్షన్లు ఇచ్చి చంపివేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అనంతరం.. వాటిని ఊరి చివరన పడేసినట్టు తెలుస్తోంది.
బయటపెట్టిన యానిమల్ ఫౌండేషన్..
ఈ అమానుష ఘటనపై సమాచారం అందుకున్న స్టేట్ యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(State Animal Foundation of India) సభ్యులు రంగంలోకి దిగారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. సామూహికంగా కుక్కలను చంపిన వైనాన్ని గుర్తించారు. వెంటనే పెగడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల చర్యలు..
జంతు సంరక్షణ చట్టాల ప్రకారం.. ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించి చర్యలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడం, జంతు హింసకు పాల్పడటం వంటి చర్యలకు గానూ గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అసలు ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? శునకాలను హతమార్చే మత్తు మందులను ఎక్కడి నుంచి సేకరించారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
వైద్య పరీక్షలు..
కుక్కల మృతికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు వెటర్నరీ వైద్యులు రంగంలోకి దిగారు. శునకాల కళేబరాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. కీలకమైన శరీర భాగాల నుంచి శాంపిల్స్(నమూనాలు) సేకరించి, వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ఆ నివేదికల ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
జంతు ప్రేమికుల ఆగ్రహం..
కుక్కలను క్రమంగా తగ్గించడానికి స్టెరిలైజేషన్(ABC - Animal Birth Control) వంటి శాస్త్రీయ పద్ధతులు పాటించాలి. కానీ, ఇలా ప్రాణాలు తీయడం చట్టరీత్యా నేరమని యానిమల్ ఫౌండేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందుతున్న సమాజంలో మూగజీవాల పట్ల ఇలాంటి క్రూరత్వం ప్రదర్శించడం విచారకరమని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నాంపల్లి ఫర్నీచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి
Read Latest Telangana News And Telugu News