నాంపల్లి ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - Jan 24 , 2026 | 03:07 PM
నాంపల్లి ప్రాంతంలోని ఫర్నిచర్ గోదాంలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
హైదరాబాద్, జనవరి24 (ఆంధ్రజ్యోతి): నాంపల్లి ప్రాంతంలోని ఓ ఫర్నిచర్ గోదాంలో శనివారం భారీ అగ్నిప్రమాదం (Nampally Fire Incident) జరిగింది. మంటలు గోదాంలోకి వ్యాపించాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు..
ఫర్నిచర్ గోదాంలో మంటలు దట్టంగా వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నాలుగు అంతస్తుల భవనమంతా క్రమంగా మంటలు అలుముకున్నాయి. దీంతో అగ్నిమాపక శాఖను వెంటనే అప్రమత్తం చేయడంతో నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది.
భవనంలో పిల్లలు..
ఈ ఘటన జరిగిన భవనంలో ఆరుగురు చిన్న పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకున్నారు. పిల్లలను సురక్షితంగా కాపాడేందుకు చర్యలు చేపట్టారు.
హిందీ ప్రచార సభ పేరుతో భవనం..
అధికారిక సమాచారం ప్రకారం.. అగ్నిప్రమాదానికి గురైన భవనాన్ని 1960లో హిందీ ప్రచార సభ పేరుతో నిర్మించినట్టు తెలుస్తోంది. కొంతమంది ఇచ్చిన దాతలు విరాళాలతో ఈ భవనాన్ని నిర్మించారు. అచ్యుత్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ల్యాండ్‌లో హిందీ ప్రచార సభ పేరుతో భవన నిర్మాణం చేపట్టగా.. కొంత కాలంగా అది అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించి అందులో షాపులు ఏర్పాటు చేశారు. ఆ షాపులను తక్షణమే ఖాళీ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమార్కులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. గతంలో ఆ భవనంలో సెట్ బ్యాక్ ఉండగా.. దాని స్థానంలో ఫర్నిచర్ షాప్ ఏర్పాటు చేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ కేసు కోర్టులో ఉన్నప్పటికీ షాపులు నడుపుతూ దందా కొనసాగిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం
బీఆర్ఎస్ నేతకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు
Read Latest Telangana News And Telugu News