హర్మన్, స్మృతి మధ్య విభేదాలు! వెలుగులోకి సంచలన నివేదిక...
ABN , Publish Date - Oct 07 , 2026 | 09:41 PM
భారత మహిళల క్రికెట్‌లో సరికొత్త వివాదం తెరమీదకు వచ్చింది. మంగళవారం హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసి ఆశ్చర్యపరిచింది. ఈనేపథ్యంలో...
స్పోర్ట్స్ డెస్క్: భారత మహిళ క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నిన్న(మంగళవారం) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన క్షణాల వ్యవధిలోనే బీసీసీఐ.. స్మృతి మంధానను కొత్త సారథిగా ప్రకటించింది. ఆమెకు డిప్యూటీగా సీనియర్ ఆల్ రౌండర్ దీప్తి శర్మను నియమించింది. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మహిళల క్రికెట్‌లో సరికొత్త వివాదం తెరమీదకు వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ దూకుడుగా ఉండే ధోరణిలో నిర్ణయాలు తీసుకుంటుండగా, వైస్ కెప్టెన్‌గా ఉన్న స్మృతి మంధాన శైలి భిన్నంగా ఉండేది. ముఖ్యంగా జట్టు వ్యూహాలు, అవగాహన విషయంలో ఇద్దరి మధ్య సయోధ్య లోపించినట్లు క్రీడా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా వారిద్దరి మధ్య సఖ్యత లేదని, దానివల్ల డ్రెస్సింగ్ రూమ్‌లో స్పష్టమైన అశాంతి నెలకొందని జట్టు వర్గాలు తెలిపాయి. ఇటీవలే గువాహటిలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కెప్టెన్సీ మార్పు అనివార్యమని బీసీసీఐ స్పష్టం చేసింది.
హర్మన్‌ను కేవలం టీ20 కెప్టెన్‌గా మాత్రమే తప్పుకోవాలని, వన్డే, టెస్టుల్లో కొనసాగాలని బీసీసీఐ కోరినట్లు, హర్మన్ ఉంటే అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉంటానని పేర్కొన్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. దీనికి బీసీసీఐ ఒప్పుకోకపోవడంతో హర్మన్ తన కెప్టెన్సీ పదవికి వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు కెప్టెన్‌గా జట్టును నడిపించిన హర్మన్ ప్రీత్.. ఇక నుంచి జట్టులో సీనియర్ ప్లేయర్‌గా మాత్రమే కొనసాగనుంది. ఈ ఏడాది ఆరంభంలో యూకేలో జరిగిన టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ నిష్క్రమించిన తర్వాత, హర్మన్‌ప్రీత్ ఫామ్, ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు లేవనెత్తుతూ.. సెలెక్టర్లు రెండు, మూడు ఏళ్ల క్రితమే మంధానకు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని మాజీ క్రీడాకారిణి మిథాలీ రాజ్ అన్నారు.
పురుషుల జట్టుపై చూపినంత ప్రత్యేక శ్రద్ధ.. మహిళల క్రికెట్‌పై లేనందున, నాయకత్వ మార్పు విషయంలో సెలెక్టర్లు పొరపాటు చేయడం ఇదే తొలిసారి కాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2022 ప్రపంచ కప్ తర్వాత మిథాలీ నుంచి హర్మన్‌ప్రీత్ వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా, ఆ ఇద్దరు సీనియర్ క్రీడాకారుల మధ్య సంబంధాలు అత్యంత బలహీనంగా ఉండేవని టాక్. అది జట్టులో వర్గపోరాటాలకు కారణమైంది. తాజాగా హర్మన్, స్మృతి మధ్య విభేదాల కారణంగా రానున్న రోజుల్లో మహిళల జట్టు ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరోవైపు హర్మన్ .. ఇకపై తన సహచర ప్లేయర్ మంధాన నేతృత్వంలో పూర్తిస్థాయి బ్యాటర్‌గా ఆడనుంది. ఇన్నాళ్లు కెప్టెన్ హోదాలో ఆమె ఆడినా, ఆడకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇకపై పరిస్థితులు వేరు కావడంతో బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్‌పై భారీ అంచనాలుంటాయి. జట్టులో నిలదొక్కుకోవాలంటే హర్మన్ తన స్థాయికి మించి ఆటను ప్రదర్శించాల్సి ఉంటుంది. లేదంటే జట్టులో చోటు కోల్పోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
చెన్నై బస్సులో యువతి హల్‌చల్.. ప్రయాణికులతో వాగ్వాదం, దాడి..
ఏపీలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక డ్రైవ్.. తొలగించిన ఓట్లపై రీ - వెరిఫికేషన్ చేస్తాం: ఏపీ సీఈవో
మాంసం కోసం 2,700 పిల్లుల కిడ్నాప్.. 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..