భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ వేళ.. నరేంద్ర మోదీ స్టేడియంలో బాంబు కలకలం!
ABN , Publish Date - Oct 07 , 2026 | 08:20 PM
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఇవాళ(బుధవారం) బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు నగరంలోని పది ప్రముఖ పాఠశాలలకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు వచ్చాయి.
స్పోర్ట్స్ డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఇవాళ(బుధవారం) బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు నగరంలోని పది ప్రముఖ పాఠశాలలకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. ముఖ్యంగా పశ్చిమ అహ్మదాబాద్‌లోని స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని ఈమెయిల్ మెసేజులు రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యగా పాఠశాలల నుంచి విద్యార్థులను వేగంగా ఇళ్లకు పంపించివేశారు.
బెదిరింపులు వచ్చిన సమయంలో స్టేడియం కాంప్లెక్స్‌లో భారత అండర్-19, ఆస్ట్రేలియా అండర్-19 జట్లు ఉన్నాయి. ఉదయం 11:15 గంటలకే యూత్ టెస్ట్ మ్యాచ్ ముగియగా, మధ్యాహ్నం 1 గంట తర్వాత క్రీడాకారులు క్షేమంగా బసకు బయలుదేరి వెళ్లారు. మరోవైపు నవంబరు 21న నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రముఖ గాయకుడు దిల్‌జీత్ దోసాంజ్ సంగీత విభావరి జరగాల్సి ఉంది. ఈ కన్సర్ట్‌కు హాజరయ్యే వారికి రక్షణ ఉండదంటూ ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు పోలీసు వర్గాలు తెలిపాయి.
సమాచారం అందుకున్న గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) కార్యదర్శి అనిల్ పటేల్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. బాంబు నిర్వీర్య బృందం, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు సంఘటనా స్థలాలకు చేరుకుని విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి:
చెన్నై బస్సులో యువతి హల్‌చల్.. ప్రయాణికులతో వాగ్వాదం, దాడి..
ఏపీలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక డ్రైవ్.. తొలగించిన ఓట్లపై రీ - వెరిఫికేషన్ చేస్తాం: ఏపీ సీఈవో
మాంసం కోసం 2,700 పిల్లుల కిడ్నాప్.. 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..