అందరికీ అక్టోబర్ 2న గాంధీ జయంతి.. అక్కడ మాత్రం అక్టోబర్ 7న..
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:51 PM
ఐదురోజుల క్రితం అందరం గాంధీ జయంతి నిర్వహించుకున్నాం. అక్కడ మాత్రం ఈరోజు గాంధీ జయంతి వేడుకలు చేసుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న గాంధీ జయంతి నిర్వహించుకుంటాం. గుజరాత్ విద్యాపీఠ్ యూనివర్సిటీలో మాత్రం ప్రతీ ఏడాది ఈ తేదీ మారుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అక్కడ అక్టోబర్ 7న (అంటే ఈరోజే) గాంధీ జయంతి వేడుకలు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఆ యూనివర్సిటీ ఫాలో అయ్యే క్యాలెండరే.
ప్రపంచవ్యాప్తంగా గ్రెగోరియన్ క్యాలెండర్‌నే అనుసరిస్తారు. దీని ప్రకారం గాంధీ జయంతి అక్టోబర్ 2న వస్తుంది. అయితే గాంధీ జన్మదినం కోసం గుజరాత్ విద్యాపీఠ్ మాత్రం భారతదేశంలో ప్రాచుర్యం పొందిన హిందూ విక్రమ్ క్యాలెండర్‌ను అనుసరిస్తోంది. హిందువుల పండుగల తేదీలను నిర్ణయించడానికి కూడా ఇదే ఉపయోగిస్తారు. దీని ప్రకారం గాంధీ జయంతి భాద్రపద మాసంలో ద్వాదశి నాడు వస్తుంది. ఈ లెక్కన ఈరోజే గాంధీ జయంతి. అందుకే గుజరాత్ విద్యాపీఠ్ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ విద్యాసంస్థను మహాత్మ గాంధీనే స్థాపించడం మరో విశేషం.
గాంధీ జన్మదినమే ‘రెంటియా బరాస్’
కాగా హిందూ విక్రమ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే గాంధీ జన్మదినాన్ని గుజరాత్‌లో ‘రెంటియా బరాస్’గా నిర్వహించుకుంటారు. రెంటియా అంటే చరఖా (రాట్నం) అని అర్థం. 1929-30ల నుంచి ‘రెంటియా బరాస్’ వేడుకలు నిర్వహించుకునే సంప్రదాయం అక్కడ ఉంది. ఈ ఏడాది వేడుకల్లో భాగంగా గుజరాత్ విద్యాపీఠ్‌కు చెందిన 1,800 మంది విద్యార్థులు అహ్మదాబాద్ నగరంలోని 351 పాఠశాలలను సందర్శించనున్నారు. చిన్నారులకు గాంధీ సిద్ధాంతాలను వివరించనున్నారు.
ఇవీ చదవండి
వేదికపై తడబడిన యువతి.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏం చేశారంటే..
పాదచారుడితో గొడవపడ్డ భారత సంతతి మహిళ.. చివరకు అరెస్ట్