ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 12 అజెండాలకు ఆమోదం
ABN , Publish Date - Oct 07 , 2026 | 01:53 PM
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.
అమరావతి, అక్టోబర్ 7: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈరోజు(బుధవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. మొత్తం 12 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. రూ.20.62 కోట్లతో APHIMS ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. 72 నెలల పాటు అమలు చేయనున్నారు. సేవలో ఉండగానే మరణించిన అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రతి ఏడాది సేవకు రూ.5 వేల చొప్పున.. గరిష్ఠంగా రూ.1.50 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని నిర్ణయించింది.
రేపల్లె 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రేపల్లె ఏరియా ఆసుపత్రి అప్‌గ్రేడేషన్‌కు రూ.58.42 కోట్లు, అదనంగా 66 పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026-27 తల్లికి వందనం మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతులకు రాటిఫికేషన్ ఇచ్చింది. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ ఛార్జీల పెంపుపై ఉత్తర్వులకు ఏపీ మంత్రివర్గం రాటిఫికేషన్ ఇచ్చింది.
విశాఖ మరికవలసలో గిరిజన విద్యార్థుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. IIT-JEE, NEETకు ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ కేంద్రం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారుల అతిథి గృహం కోసం 1.69 ఎకరాల భూమి వర్గీకరణ మార్పునకు ఆమోదం లభించింది. ఎన్టీఆర్ జిల్లాలో అభ్యంతరం లేని ప్రభుత్వ పోరంబోకు భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణకు జారీ చేసిన ఉత్తర్వులకు రాటిఫికేషన్ ఇచ్చింది. వైఎస్సార్ కడప జిల్లా పాతూరులో ఆలయ అభివృద్ధికి 7.66 ఎకరాల ప్రభుత్వ భూమిని దేవాదాయశాఖకు బదలాయింపునకు ఆమోదం తెలిపింది.
ప్రకాశం జిల్లా కొండపిలో బాలుర రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్ కోసం 7 ఎకరాల భూమి వర్గీకరణ మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ విద్యా చట్టం–1982కు సవరణలు చేసే ప్రతిపాదనకు, విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ప్రైవేట్ యూనివర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు కొత్త పాలసీ–2026కు ఆమోదముద్ర పడింది. అలాగే విదేశీ విద్యాసంస్థలు, ప్రైవేట్ యూనివర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటు, ప్రోత్సాహకాలు, సదుపాయాలపై సమగ్ర విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదించింది.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ తరువాత విజయవాడలో సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
విశాఖలో CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రారంభం.. రూ.4,249 కోట్ల ప్రాజెక్టులకు భూమి పూజ
Read Latest AP News And Telugu News