Share News

శివరాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం.. ముఖానికి అతి సమీపాన పేలిన టపాసులు..

ABN , Publish Date - Oct 07 , 2026 | 09:13 PM

కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన తల, ముఖానికి అతి సమీపంలో టపాసులు పేలాయి. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన శివరాజ్‌కుమార్ ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

శివరాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం.. ముఖానికి అతి సమీపాన పేలిన టపాసులు..
Kannada Star Shivarajkumar

కర్ణాటక: కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయనకు అతి సమీపంలో టపాసులు పేలాయి. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన శివరాజ్‌కుమార్ ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల విడుదలైన తన ‘బైల్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందంతో కలిసి ఆయన చిత్రదుర్గలోని బసవేశ్వర థియేటర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యం, అభిమానులు ఘనస్వాగతం పలికారు.


థియేటర్‌లోకి వారంతా ప్రవేశిస్తుండగా.. శివరాజ్‌కుమార్ ముఖానికి అతి సమీపంలో టపాసులు పేలాయి. పెద్ద శబ్దంతో, వెలుగులు విరజిమ్ముతూ పేలుడు జరిగింది. దీంతో ఆయన వెంటనే ముఖం, తలను చేతులతో కప్పుకున్నారు. భారీగా పొగ అలుముకోగా.. అప్రమత్తమైన బృంద సభ్యులు వెంటనే ఆయనకు రక్షణగా నిలిచారు. అనంతరం శివరాజ్‌కుమార్ తన ముఖం, తలను చేతులతో తుడుచుకుంటూ కనిపించారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగినప్పటికీ శివరాజ్‌కుమార్ తన ప్రమోషన్ కార్యక్రమాన్ని కొనసాగించారు. అభిమానులతో మాట్లాడి, థియేటర్ యాజమాన్యంతో ముచ్చటించి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.


ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో శివరాజ్ కుమార్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. థియేటర్ వద్ద భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఇదిలా ఉండగా.. కొంతకాలం వైద్య చికిత్స కోసం అమెరికాలో ఉన్న శివరాజ్‌కుమార్ ప్రస్తుతం తిరిగి సినిమాల్లో బిజీగా మారారు. ఆయన పలు కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘జైలర్ 2’, ‘పికాసో’, ‘గుమ్మడి నర్సయ్య’తో పాటు ‘డ్యాడ్’, ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’, ‘ఎ ఫర్ ఆనంద్’ వంటి చిత్రాల్లో పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..

థాయ్ మహిళకు షాక్.. ప్రేమ, పెళ్లి పేరుతో రూ.60 లక్షలు స్వాహా..

Updated Date - Oct 07 , 2026 | 09:21 PM