Share News

థాయ్ మహిళకు షాక్.. ప్రేమ, పెళ్లి పేరుతో రూ.60 లక్షలు స్వాహా..

ABN , Publish Date - Oct 07 , 2026 | 06:08 PM

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి ప్రేమ, పెళ్లి పేరుతో థాయ్‌లాండ్‌కు చెందిన మహిళను మోసం చేయడం కలకలం రేపుతోంది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆపై థాయ్‌లాండ్‌కు వెళ్లిన ఆ వ్యక్తి మహిళను వివాహం చేసుకుని మోసం చేశాడు.

థాయ్ మహిళకు షాక్.. ప్రేమ, పెళ్లి పేరుతో రూ.60 లక్షలు స్వాహా..
Thailand woman Issue

కాన్పూర్: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి ప్రేమ, పెళ్లి పేరుతో థాయ్‌లాండ్‌కు చెందిన మహిళను మోసం చేయడం కలకలం రేపుతోంది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆపై థాయ్‌లాండ్‌కు వెళ్లిన ఆ వ్యక్తి మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె నుంచి లక్షల రూపాయల నగదు వసూలు చేశాడు. రెండేళ్లు గడిచిన తర్వాత ఒక్కసారిగా భార్యను వదిలేసి భారత్‌కు వచ్చేశాడు. భర్తను వెతుక్కుంటూ భారత్‌కు వచ్చిన మహిళకు అతని గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. దీంతో మోసపోయినట్లు గుర్తించి బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది.


థాయ్‌లాండ్‌కు చెందిన అప్సోర్న్ అనే మహిళ స్థానికంగా రెస్టారెంట్ నిర్వహిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఆమెకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన తోలు వ్యాపారి ఇర్ఫాన్‌తో పరిచయం ఏర్పడింది. వారి స్నేహం కాస్తా కొన్ని నెలల్లోనే ప్రేమగా మారింది. అనంతరం రెండేళ్ల కిందట థాయ్‌లాండ్‌కు ఇర్ఫాన్ వెళ్లాడు. తన కోసమే వచ్చానని చెప్పి అప్సోర్న్‌ను అక్కడే వివాహం చేసుకున్నాడు. వారి పెళ్లి తర్వాత ఇర్ఫాన్ వ్యాపార, ఇతర ఆర్థిక అవసరాల నిమిత్తం ఆమె నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలెట్టాడు. భర్తను నమ్మిన మహిళ.. తన రెస్టారెంట్ ద్వారా వచ్చిన ఆదాయం సహా బంధువుల నుంచి అప్పుగా తీసుకుని దాదాపు రూ.60 లక్షలు ఇచ్చింది. అయితే, కొన్ని రోజులకే ఆమెతో తెగతెంపులు చేసుకుని భారత్‌కు ఇర్ఫాన్ వచ్చేశాడు.


అయితే, నెలలు గడుస్తున్నా భర్త నుంచి సమాచారం అందకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ 2026 అక్టోబర్ 6న భారత్‌కు అప్సోర్న్ వచ్చింది. కాన్పూర్‌లోని ఇర్ఫాన్ ఇంటికి చేరుకోగా.. ఆమెకు షాకింగ్ విషయాలు తెలిశాయి. అతడికి 12 ఏళ్ల కిందటే వివాహం అయ్యిందని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారన తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. తనను మోసం చేశావని అతడిపై ఆగ్రహిస్తూ డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో సదరు మహిళపై దాడి చేయడమే కాకుండా.. తనతో ఉండాలన్నా, డబ్బు తిరిగి ఇవ్వాలన్నా మతం మారాలని ఇర్ఫాన్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి నిందితుడు ఇర్ఫాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

25 ఏళ్ల పాలనపై ప్రధాని మోదీ ప్రసంగం.. కీలక అంశాలివే..

ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..

Updated Date - Oct 07 , 2026 | 06:08 PM