25 ఏళ్ల పాలనపై ప్రధాని మోదీ ప్రసంగం.. కీలక అంశాలివే..
ABN , Publish Date - Oct 07 , 2026 | 03:51 PM
దేశ అభివృద్ధి లక్ష్యాలకు మరింత ఊపునిచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ కొత్త నినాదాన్ని ఇచ్చారు. ‘మనం సాధిస్తాం’ అనే సంకల్పంతో భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: దేశ అభివృద్ధి లక్ష్యాలకు మరింత ఊపునిచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ కొత్త నినాదాన్ని ఇచ్చారు. ‘మనం సాధిస్తాం’ అనే సంకల్పంతో భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. తన 25 ఏళ్ల ప్రజా సేవ పూర్తయిన సందర్భంగా బుధవారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు, భారత్ లక్ష్యాలను ఆయన ప్రస్తావించారు.
దేశం చిన్న లక్ష్యాలతో సంతృప్తి చెందకూడదని, భారీ ఆశయాలతో ముందుకు సాగాల్సిన సమయం ఇదేనని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఐదు కీలక లక్ష్యాలను ప్రకటించారు. ప్రపంచంలోని టాప్-3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ను నిలపడం, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించడం, ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగడం, ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం, అంతరిక్షంలో మానవుడిని అడుగుపెట్టించడం తమ ప్రధాన సంకల్పాలని ప్రధాని తెలిపారు. మోదీ ఒక్కో లక్ష్యాన్ని ప్రస్తావించిన ప్రతిసారీ సభలోని ప్రజలు, కార్యకర్తలు ‘మనం సాధిస్తాం’ అంటూ ఉత్సాహంగా స్పందించారు. కాగా, ఈ ఉత్సాహం దేశ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని మోదీ పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య సంక్షోభం వంటి ప్రపంచ సవాళ్ల మధ్య భారత్ ఆర్థికంగా స్థిరంగా ముందుకు సాగిందని ప్రధాని చెప్పారు. గతంలో సంక్షోభం వస్తే భారత ఆర్థిక వ్యవస్థపై ఆందోళన ఉండేదని, ఇప్పుడు భారత్ స్థైర్యం గురించి ప్రపంచం మాట్లాడుతోందన్నారు. మరోవైపు, తయారీ రంగాన్ని బలోపేతం చేసి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ ఆర్థిక శక్తిని పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఐదు లక్ష్యాల ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ సాధించడమే అంతిమ లక్ష్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
దోశలో చనిపోయిన ఎలుక.. రూ.25 లక్షలు డిమాండ్ చేసి అడ్డంగా బుక్కైన మహిళ..
సీఈసీ, ఈసీల నియామకాలపై భిన్న తీర్పులు.. పరిశీలనకు సుప్రీంకోర్టు అంగీకారం