Share News

దోశలో చనిపోయిన ఎలుక.. రూ.25 లక్షలు డిమాండ్ చేసి అడ్డంగా బుక్కైన మహిళ..

ABN , Publish Date - Oct 07 , 2026 | 03:14 PM

ముంబైలో దోశలో చనిపోయిన ఎలుక కనిపించిందన్న వార్త ఇటీవల కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే కేసు ఊహించని మలుపు తిరిగింది. దీనిని అడ్డుపెట్టుకుని హోటల్ యజమానిని బెదిరించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

దోశలో చనిపోయిన ఎలుక.. రూ.25 లక్షలు డిమాండ్ చేసి అడ్డంగా బుక్కైన మహిళ..
Rat in Dosa Case

ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో దోశలో చనిపోయిన ఎలుక కనిపించిందన్న వార్త ఇటీవల కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే కేసు ఊహించని మలుపు తిరిగింది. దీనిని అడ్డుపెట్టుకుని హోటల్ యజమానిని బెదిరించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. రాజీ కోసం ఆమె ఏకంగా రూ.25 లక్షలు డిమాండ్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు డబ్బులు తీసుకునేందుకు వచ్చిన మహిళను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


మాన్సీ ఆచార్య(36) అనే మహిళ సెప్టెంబర్ 24న తన కుటుంబ సభ్యులతో కలిసి బోరివలిలోని రాధాకృష్ణ హోటల్‌కు వెళ్లింది. అక్కడ వారంతా ఫుడ్ ఆర్డర్ చేశారు. మాన్సీ సోదరుడు తింటున్న మైసూర్ మసాలా దోశలో చనిపోయిన ఎలుక కనిపించింది. తీవ్ర ఆందోళనకు గురైన అతడు వెంటనే వాంతులు చేసుకున్నాడు. ఆ తర్వాత హోటల్ సిబ్బందితో వారంతా వాగ్వాదానికి దిగారు. అనంతరం దీనిపై బోరివలి పోలీసులకు సమాచారం అందించారు. అలాగే, దోశలో ఎలుక ఉన్న దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటన వైరల్ కావడంతో సెప్టెంబర్ 28న ఎఫ్‌డీఏ అధికారులు హోటల్ లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. ఈ పరిణామంతో హోటల్ మూతపడే పరిస్థితి ఏర్పడింది.


అయితే, ఆ తర్వాత హోటల్ యజమానికి వరుసగా బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమైంది. వీడియోను మరింతగా వైరల్ చేస్తామని హెచ్చరిస్తూ మాన్సీ రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. పదేపదే ఫోన్ కాల్స్ చేస్తూ అతడిని వేధించింది. చివరకు రూ.6 లక్షలకు సెటిల్‌మెంట్ చేసుకున్నారు. అనంతరం హోటల్ యజమాని సెప్టెంబర్ 29న బోరివలి పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే తాను రూ.లక్ష ఇచ్చినట్లు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పథకం ప్రకారం వల పన్నారు. మరో రూ.6 లక్షలు తీసుకునేందుకు మహిళను పిలిపించి, ఆమె నగదు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మాన్సీ ఆచార్యతో పాటు ఇతరుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

భారతీయ యువ గణిత శాస్త్రవేత్తకు రామానుజన్ ప్రైజ్

సీఈసీ, ఈసీల నియామకాలపై భిన్న తీర్పులు.. పరిశీలనకు సుప్రీంకోర్టు అంగీకారం

Updated Date - Oct 07 , 2026 | 03:30 PM