పునరాగమనాన్ని ఘనంగా చాటిన బుమ్రా.. జడేజాను అధిగమించి..
ABN , Publish Date - Jul 14 , 2026 | 06:39 PM
భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన వన్డే పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో హ్యారీ బ్రూక్ వికెట్‌తో ఈ స్పీడ్‌స్టర్ రెండు ఘనతలు సాధించాడు. అవేంటంటే...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వన్డేల్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. 968 రోజుల తర్వాత వన్డే జట్టులోకి తిరిగొచ్చిన బుమ్రా.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలోనే రెండు అరుదైన ఘనతలు సాధించాడు. ప్రత్యర్థి టీమ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వికెట్‌ను పడగొట్టిన ఈ పేసర్.. ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో 31 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు 30 వికెట్లతో రవీంద్ర జడేజా పేరిట ఉండేది. తాజాగా.. జస్‌ప్రీత్ ఆ మార్కును అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు.
ఇంగ్లండ్‌లో అత్యధిక వన్డే వికెట్లు తీసిన భారత బౌలర్లు:
జస్ప్రీత్ బుమ్రా - 31*
రవీంద్ర జడేజా - 30
భువనేశ్వర్ కుమార్ - 28
మదన్ లాల్ - 27
మహ్మద్ షమీ - 26
ఈ క్రమంలో మరో ఘనతను కూడా సాధించాడీ స్పీడ్‌స్టర్. తన వన్డే కెరీర్‌లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్న బుమ్రా.. భారత బౌలర్లలో అత్యంత వేగంగా(4,605 బంతుల్లో) 150 వికెట్లు సాధించిన జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ లిస్ట్‌లో మహ్మద్ షమీ(4,070 బంతులు), కుల్దీప్ యాదవ్(4,513 బంతులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
బంతుల పరంగా అత్యంత వేగంగా 150 వన్డే వికెట్లు(భారత బౌలర్లు):
4,070 - మహ్మద్ షమీ
4,513 - కుల్దీప్ యాదవ్
4,605 - జస్‌ప్రీత్ బుమ్రా*
5,027 - అజిత్ ఆగార్కర్
5,131 - ఇర్ఫాన్ పఠాన్
అయితే.. ఈ మ్యాచ్‌లో తొలి స్పెల్‌లో వికెట్ దక్కని బుమ్రా.. పవర్‌ప్లే అనంతరం తన రెండో స్పెల్ మొదటి బంతికే హ్యారీ బ్రూక్‌ను వెనక్కిపంపాడు. ఫస్ట్ స్లిప్‌లో శుభ్‌మన్ గిల్ క్యాచ్ అందుకోవడంతో ఫామ్‌లో ఉన్న కెప్టెన్ బ్రూక్.. ఒక పరుగుకే వెనుదిరగాల్సి వచ్చింది. అంతకుముందు.. గర్నూర్ బ్రార్ వరుసగా బెన్ డకెట్, జాకబ్ బెథెల్ వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 21.4 ఓవర్లలో 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య టీమ్.. ఆ తర్వాత నిలకడగా బ్యాటింగ్ సాగిస్తోంది. ఈ వార్త రాసే సమయానికి 41 ఓవర్లలో 210/6 తో మెరుగైన స్థితికి చేరింది. లియామ్ డాసన్ 61*, జో రూట్ - 50* పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇవీ చదవండి:
టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు.. రాజీనామాకు సిద్ధమైన ర్యాన్ టెన్..
ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు.. అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ