పాక్‌తో మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్‌కు దూరంగా భారత్.. ఎందుకిలా.?
ABN , Publish Date - Oct 03 , 2026 | 01:28 PM
ఆసియా క్రీడల భారత్-పాక్ క్రికెట్ ఫైనల్లో ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ చేసుకోలేదు. అయితే టేబుల్ టెన్నిస్, స్క్వాష్, హాకీ, వాలీబాల్‌లో మాత్రం క్రీడాస్ఫూర్తితో పరస్పరం అభివాదాలు చేసుకున్నారు. కానీ క్రికెట్లోనే ఎందుకిలా.?
ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే తీవ్ర ఉత్కంఠ. ఆసియా క్రీడల్లోనూ ఇరు జట్ల మధ్య పోరు ఆసక్తి రేపింది. అయితే.. శనివారం జరిగిన మెన్స్ క్రికెట్ తుదిపోరులో ఇరు జట్ల ఆటగాళ్లు మరోసారి హ్యాండ్‌షేక్‌కు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. టాస్ సందర్భంగా భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, పాక్ కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్.. పరస్పరం అభివాదం చేసుకున్నారే తప్ప హ్యాండ్‌షేక్ చేసుకోలేదు.
కాగా.. క్రికెట్లో కనిపించిన ఈ దృశ్యానికి భిన్నంగా ఆసియా క్రీడల్లోని మిగిలిన అన్ని క్రీడల్లో భారత్, పాక్ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారు. టేబుల్ టెన్నిస్‌లో మ్యాచ్ పూర్తయ్యాక ఇరు దేశాల ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులతో హ్యాండ్‌షేక్‌లు, అభివాదాలు చేసుకున్నారు. స్క్వాష్‌లోనూ ఇదే పద్ధతే కనిపించింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో భారత ఆటగాడు అభయ్ సింగ్, పాక్‌కు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ తలపడ్డారు. ఈ మ్యాచ్లో 11-3, 12-10, 11-6తో అభయ్ గెలుపొందగా.. ఆ తర్వాత ఇరువురూ కరచాలనం చేసుకున్నారు.

అటు.. హాకీలోనూ భారత్-పాక్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్లో 4-3తో విజయం సాధించినా.. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం చేతులు కలుపుకున్నారు. దాయాది టీమ్ కోచ్ తాహిర్ జమాన్ కూడా భారత ఆటగాళ్లతో హ్యాండ్‌షేక్ చేశారు. వాలీబాల్‌లోనూ క్రీడాస్ఫూర్తికి సంబంధించిన దృశ్యమే కనిపించింది. భారత్‌పై పాక్ 3-0తో విజయం సాధించగా.. మ్యాచ్ ముగిశాక ప్రత్యర్థి ఆటగాళ్లు, టీమ్ఇండియాను ఓదార్చారు. పాక్ ఆటగాడు ముసావీర్ ఖాన్.. భారత ఆటగాడు అమిత్ బల్వాన్ సింగ్ తలను ఆప్యాయంగా తడుముతూ కనిపించగా.. మరో ఆటగాడు అతడి వీపుపై తట్టడం కనిపించింది.

క్రికెట్‌లో మాత్రమే భిన్నంగా..
భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌ల్లో హ్యాండ్‌షేక్ లేకపోవడం ఇదేం కొత్త కాదు. 2025 ఆసియా కప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల నుంచి ఇదే పద్ధతి కనిపిస్తోంది. గత నెలలో జరిగిన ఆసియా కప్‌లో మహిళల జట్ల మధ్య మ్యాచ్‌లోనూ షేక్‌హ్యాండ్ చోటుచేసుకోలేదు. ఆసియా క్రీడల ఫైనల్లోనూ అదే కొనసాగింది.
ఇవీ చదవండి:
ఆసియాడ్ క్రికెట్: అభిషేక్, తిలక్ హాఫ్ సెంచరీలు.. పాకిస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఆసియా క్రీడలు: ప్రణవి శరత్ సంచలనం.. గోల్ఫ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం