Share News

వైరల్ రీల్ కోసం ‘కిస్సింగ్ కార్’.. యువకుడికి జరిమానా.!

ABN , Publish Date - Aug 25 , 2026 | 02:08 PM

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వైరల్ రీల్ కోసం ఓ యువకుడు చేసిన వినూత్న ప్రయత్నం చివరకు ట్రాఫిక్ పోలీసుల చర్యకు దారితీసింది.

వైరల్ రీల్ కోసం ‘కిస్సింగ్ కార్’.. యువకుడికి జరిమానా.!
Kissing Car viral Reel

ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వైరల్ రీల్ కోసం ఓ యువకుడు చేసిన వినూత్న ప్రయత్నం చివరకు ట్రాఫిక్ పోలీసుల చర్యకు దారితీసింది. గ్వాలియర్‌కు చెందిన ఆదిత్య సికర్వార్ తన ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం కారును ఏకంగా ‘కిస్సింగ్ కార్’గా మార్చాడు. తెల్లటి మారుతి సుజుకి స్విఫ్ట్ కారుపై సుమారు 3,400 లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులను వేయించి, ఆ కారును రోడ్డుపైకి తీసుకెళ్లి వీడియోను చిత్రీకరించాడు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. కేవలం 24 గంటల్లోనే దాదాపు 55 లక్షల వ్యూస్ సాధించింది. అయితే వైరల్ కావడంతో పాటు గ్వాలియర్ ట్రాఫిక్ పోలీసుల దృష్టిని కూడా ఆకర్షించింది. ఆ వీడియోలో కారు రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా పోలీసులు ఈ వాహనాన్ని గుర్తించారు.


ఆదిత్య స్నేహితురాలు కారుపై బ్యానెట్, డోర్లతో సహా దాదాపు కారు మొత్తం ఎర్రటి లిప్‌స్టిక్‌తో 3,400 ముద్దుల గుర్తులను వేసినట్లు అతను వెల్లడించాడు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సుమారు మూడున్నర గంటల సమయం పట్టింది. అనంతరం కారును రోడ్డుపై నడుపుతూ రీల్ చిత్రీకరించాడు.


వైరల్ వీడియోను పరిశీలించిన పోలీసులు కారును థాటిపూర్ ప్రాంతంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆదిత్యను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి స్టంట్‌పై ప్రశ్నించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు రూ.5,500 జరిమానా విధించారు.


పోలీసుల ఎదుట తన తప్పును అంగీకరించిన ఆదిత్య.. ఆ తర్వాత కారుపై ఉన్న లిప్‌స్టిక్ ముద్రలను తొలగించినట్టు సమాచారం. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.


ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వైరల్ కావాలనే ఉద్దేశంతో చేసే స్టంట్లు వ్యక్తిగత వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర వాహనదారుల భద్రతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై నివేదిక సిద్ధం చేసిన క్రమశిక్షణ కమిటీ

సీఎంసీ ఫిర్యాదుతో హైడ్రా యాక్షన్.. ప్రమాదకర భవనం తొలగింపు

చికెన్ వ్యర్థాలపై అధికారుల చర్యలు.. 100 టన్నుల స్వాధీనం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 25 , 2026 | 02:24 PM