నేపాల్‌లో భారతీయ మహిళకు షాక్.. గుహలో చిక్కుకుపోయి..
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:19 PM
ఇటీవల ఓ భారతీయ పర్యాటకురాలికి చేదు అనుభవం ఎదురైంది. నేపాల్‌లోని బ్యాట్ గుహను సందర్శించిన ఆమెకు ఊహించని షాక్ తగిలింది.
ఇంటర్నెట్ డెస్క్: పర్యాటకం అంటే దాదాపుగా అందరికీ ఇష్టమే. కొత్త కొత్త ప్రదేశాలు కనులారా చూసేందుకు చాలా మంది ముందుంటారు. అయితే ఈ పర్యాటకంలో కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. ఇటీవల ఓ భారతీయ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. నేపాల్‌లోని బ్యాట్ గుహను సందర్శించిన ఆమెకు ఊహించని షాక్ తగిలింది. చీకటిగా ఉండే గుహలో ఆ మహిళ చిక్కుకుపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
భారత్‌కు చెందిన ఓ పర్యాటకురాలు తాజాగా నేపాల్ వెళ్లారు. అక్కడి ప్రకృతి సౌందర్యాలను, చారిత్రక కట్టడాలను తిలకించారు. ఆ దేశంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పోఖారాలోని ‘బ్యాట్ కేవ్’ గురించి తెలుసుకున్నారు. దీంతో అటు వెళ్లొద్దామని ఫిక్స్ అయ్యారు. అనుకున్నట్టుగానే ‘బ్యాట్ కేవ్’ను సందర్శించారు. చీకటిగా ఉన్న ఈ గుహను చూసి ఆమె థ్రిల్ అయ్యారు. కానీ ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ మహిళ గుహలో చిక్కుకుపోయారు. వెనక్కు వెళ్లలేక.. ముందుకు రాలేక అక్కడే ఇరుక్కుపోయారు.
బయటపడడానికి ఆ పర్యాటకురాలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఒక్కసారిగా ఆమె ఆందోళనకు గురయ్యారు. తనను కాపాడాలంటూ అరవడం మొదలుపెట్టారు. ఏడుస్తూ రక్షణ కోసం కేకలు వేయసాగారు. ఆమె అరుపులు విన్న మిగతా పర్యాటకులు సాయం చేసేందుకు వచ్చారు. మహిళను ఓ వ్యక్తి శాంతపరిచారు. తరువాత గుహ నుంచి ఆమెను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన భద్రతా సిబ్బందిని పిలిచారు. వారు చేరుకుని ఆమెను రక్షించారు. బయటకొచ్చిన మహిళ ఊపిరిపీల్చుకున్నారు. ఘటన తరువాత ఆమె పరిస్థితి సాధారణంగానే ఉందని పరీక్షించిన వైద్యులు ధ్రువీకరించారు. కాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పర్యాటకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కొందరు కామెంట్లలో సూచిస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి
ఈ కుక్కకు గోల్డ్ మెడల్.. ఎందుకో తెలిస్తే..
స్మార్ట్ కళ్లద్దాల చోరీ.. తనను తానే రికార్డు చేసుకున్న దొంగ