Share News

అడుగంటుతున్న తుంగభద్ర జలాశయం

ABN , Publish Date - Apr 21 , 2026 | 01:23 PM

తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎండల తీవ్రత ఒక కారణమైతే, జలాశయం భద్రత దృష్ట్యా చేపట్టిన క్రస్ట్‌గేట్ల ఆధునికీకరణ పనులు నీటి నిలువలపై ప్రభావం చూపుతున్నాయి.

అడుగంటుతున్న తుంగభద్ర జలాశయం
Tungabhadra dam, water level

  • మండుతున్న ఎండలతో పడిపోతున్న నీటిమట్టం

  • వేసవిలో నీటి కష్టాలు తప్పవా..?

బళ్లారి(కర్ణాట): తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎండల తీవ్రత ఒక కారణమైతే, జలాశయం భద్రత దృష్ట్యా చేపట్టిన క్రస్ట్‌గేట్ల ఆధునికీకరణ పనులు నీటి నిలువలపై ప్రభావం చూపుతున్నాయి. 2024,లో 19వ గేటు కొట్టుకుని పోయిన తరువాత డ్యామ్‌ భద్రతను దృష్టిలో ఉంచుకుని మొత్తం 33 గేట్లు మార్చాలని ఇరు ప్రభుత్వాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే.. ఈ మరమ్మతుల పనులు కారణంగానే గత సీజన్‌లో జలాశయం పూర్తి సామర్థ్యం 105 టీఎంసీలు ఉన్నప్పటికీ భద్రతా కారణాల రీత్యా నీటి నిలువ సుమారు 80టిఎంసిలకే పరిమితం చేయాల్సి వచ్చింది.


ఈ పరిమిత నిలువ విధానం ప్రస్తుతం వేసవిలో నీటి లభ్యతపై ప్రభావం చూపుతోంది. సాధారణంగా పూర్తిస్థాయిలో నీరు నిలువ ఉంటే వేసవి చివరి వరకు నిశ్చితంగా ఉండే పరిస్థితి ఉండేది. కానీ, గేట్లు ఏర్పాటు పనులు జరుగుతుండడంతో నీటిని గరిష్ట స్థాయి వరకు నిలువ చేయలేక పోయారు. ఏప్రిల్‌ 18, 2026 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం జలాశయం గరిష్ట నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1592.06 అడుగుల వద్ద నీరు ఉంది. డ్యామ్‌ మొత్తం నీటి నిలువ 105.788 టిఎంసిలు కాగా ఇపుడు 12.836 టిఎంసిల నీరు నిలువ ఉంది.


tuinga.jpgఇది గత ఏడాది ఇదే రోజున కేవలం 7.030 టీఎంసిలు మాత్రమే ఉండగా, గత పదేళ్ళ సగటు 5.313 టీఎంసీలుగా ఉంది. అంటే ఈ ఏడాది నీటి పరిస్థితి గత పదేళ్ల సగటు కంటే రెట్టింపు స్థాయిలో ఉండడం గమనార్హం.. ప్రస్తుతానికి వచ్చే ప్రవాహం సున్నాగా నమోదయినప్పటికీ రాయచూరు, బళ్ళారి, కొప్పళ, విజయనగర జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల తాగునీటి అవసరాల దృష్ట్యా కాలువల ద్వారా 4,254 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే మే చివరి నాటికి కొత్తగేట్లు ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తికావచ్చని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. అప్పటి వరకు ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడం ద్వారా మాత్రమే తాగునీటి ఎద్దడిని అధిగమించగలమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

విజయ్‌కు నీరా‘జనం’

పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కలకలం..! 400 మందికి పైగా అస్వస్థత

Read Latest Telangana News and National News

Updated Date - Apr 21 , 2026 | 01:23 PM