Share News

తమిళ ప్రజల భవిష్యత్తు కోసమే చెన్నైకి వచ్చా: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:28 AM

తమిళ ప్రజల భవిష్యత్తు కోసం తానే స్వయంగా చెన్నైకి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు ఓటు వేయాలని ఆయన కోరారు.

తమిళ ప్రజల భవిష్యత్తు కోసమే చెన్నైకి వచ్చా: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

చెన్నై: తమిళ ప్రజల భవిష్యత్తు కోసం తానే స్వయంగా చెన్నైకి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ ముందు చూపుతో ఆలోచిస్తారని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు ఓటు వేయాలని ఆయన కోరారు. ఒకప్పుడు దేశంలో చెన్నై కీలక స్థానంలో ఉందని.. ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. నగర అభివృద్ధి గణనీయంగా మందగించిందని.. చెన్నై ఎయిర్‌పోర్టు పరిస్థితి సంతృప్తికరంగా లేదన్నారు. బెంగళూరు, హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందాయని.. ఐటీ, మౌలిక వసతులు, పెట్టుబడుల విషయంలో ముందున్నాయని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. తమిళనాడులో సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఎన్డీఏకి మద్దతు కోరుతూ చెన్నైలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు.


మేధావులు పుట్టిన నేల..

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..'తమిళనాడుకు గొప్ప చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఉంది. ఒకప్పుడు చెన్నై ప్రధాన కేంద్రంగా సినీ పరిశ్రమ, ఉద్యోగ అవకాశాలు విస్తారంగా ఉండేవి. నా వివాహం కూడా ఇక్కడే జరిగింది. ఈ నగరంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఏపీజే అబ్దుల్ కలాం, ఎంఎస్ స్వామినాథన్, అన్నాదురై వంటి మహానుభావులు తమిళనాడులో జన్మించారు. దేశానికి గొప్ప మేధావులను ఈ రాష్ట్రం అందించింది. కానీ, ప్రస్తుతం చెన్నైలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దెబ్బతింది. మహిళలపై నేరాలు సుమారు 59 శాతం మేర పెరిగాయి. కస్టోడియల్ డెత్ కేసులూ పెరిగాయి. నకిలీ మద్యం ఘటనలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి.


డబుల్ ఇంజన్ సర్కార్ భేష్..

చెన్నై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. 1995 నుంచి చాలా రోడ్లు అలానే ఉన్నాయి. వర్షాలు పడితే నగరంలో రోడ్లు మునిగిపోతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. ⁠తమిళనాడుకు కేంద్రం నుంచి సమృద్ధిగా నిధులు వచ్చాయి. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు ఎంజీ రామచంద్రన్ పేరు పెట్టింది కేంద్ర ప్రభుత్వమే. ⁠హైస్పీడ్ రైలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రాభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారుతాయి. ప్రకాశవంతమైన భవిష్యత్, మంచి ఉద్యోగ అవకాశాలు కావాలంటే ప్రజలు ఈసారి జాగ్రత్తగా, తెలివిగా ఓటు వేయాలి. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర సమన్వయం ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. కేవలం రాజకీయ కారణాలతో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెళ్లకూడదు. రాజకీయ లాభాల కోసం రాష్ట్రానికి నష్టం చేయడం సరైంది కాదు. అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. ప్రధాని మోదీకి సహకరించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి.


మహిళలకు అన్యాయం చేశారు..

పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులను కాంగ్రెస్, డీఎంకే పార్టీలు అడ్డుకున్నాయి. మహిళలకు రావాల్సిన ప్రాతినిధ్యాన్ని అడ్డుకుని ద్రోహం చేశాయి. దక్షిణాది రాష్ట్రాలకు లెక్కల ప్రకారం సీట్లు తగ్గుతాయని ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవానికి సీట్లు పెరుగుతాయి. బిల్లులో స్పష్టంగా సీట్ల పెంపు గురించి పేర్కొన్నారు. తమిళనాడులో ప్రస్తుతం 39 సీట్లు ఉండగా.. 59కి పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి. ⁠డీలిమిటేషన్ ప్రక్రియలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు. సమతుల్యమైన ఫార్ములాతోనే సీట్ల పునర్విభజన జరుగుతుంది. కానీ ప్రస్తుత జనగణన ఆధారంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాలు వెనుకపడే ప్రమాదం ఉంది. ఆర్థిక సంస్కరణల వల్లే దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. పర్ క్యాపిటా ఆదాయం గణనీయంగా పెరిగింది. నేను కూడా ద్రవిడ వ్యక్తినే. దక్షిణాది అభివృద్ధి పట్ల నాకు ప్రత్యేక దృష్టి ఉంది. ⁠⁠ముందుచూపు ఉన్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ. దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విజనరీ లీడర్ మోదీ. ఈసారి ఎన్నికల్లో ఎన్డీయేకే మద్దతు తెలుపుదాం' అని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది.. ఎక్స్ వేదికగా భారత ఆర్మీ ట్వీట్..

పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కలకలం..! 400 మందికి పైగా అస్వస్థత

Updated Date - Apr 21 , 2026 | 12:13 PM