Share News

ఐపీఎల్ 2026: భారీ ఓటమిపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ కీలక కామెంట్స్

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:55 PM

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో గుజరాత్‌ టైటాన్స్‌ 99 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. మ్యాచ్‌ అనంతరం గుజరాత్ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2026: భారీ ఓటమిపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ కీలక కామెంట్స్
Shubman Gill

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (సోమవారం) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో గుజరాత్‌ టైటాన్స్‌ 99 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. తిలక్‌ వర్మ (101 నాటౌట్‌) రికార్డు శతకంతో ముంబై ఇండియన్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు గుజరాత్‌కు ఇది హ్యాట్రిక్‌ విజయాల తర్వాత తొలి పరాజయం. ఈ మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 200 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్‌ చేతులెత్తేసింది. 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్‌ అనంతరం గుజరాత్ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. మధ్య ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డాడు.


'ఈ పిచ్ కాస్త మందకొడిగా, నెమ్మదిగా ఉందని మా జట్టు ఆట ఆరంభంలోనే గుర్తించింది. అయినప్పటికీ ముంబై జట్టును భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయడంలో మా బౌలర్లు విఫలమయ్యారు. పిచ్‌పై 160-170 పరుగులే ఎక్కువ స్కోరు. మా బౌలర్లు మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేకపోవడం వల్ల ప్రత్యర్థి జట్టు అదనపు పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. వాటిని భవిష్యత్తులో అమలు చేయాల్సిన అవసరం ఉంది' అని శుభ్‌మన్‌ గిల్ వెల్లడించాడు.


'వికెట్ కొంచెం నెమ్మదిగా ఉంది. బంతి సరిగా బ్యాట్‌పైకి రాకపోవడం బౌలర్లకు సవాలుగా మారింది. మధ్య ఓవర్లలో ఒకే లెంగ్త్‌ను కచ్చితంగా పాటించలేకపోయాము. ఈ ఓటమిని పెద్ద అవరోధంగా చూడటం లేదు. ఇకపై బయట మైదానాల్లో జరిగే మ్యాచ్‌ల్లో తిరిగి విజయాల బాట పట్టేందుకు ఈ మ్యాచ్ ఓటమి ఓ గుణపాఠం. జట్టు ప్రదర్శనను మెరుగుపరచుకోవడానికి అవసరమైన మార్పులు చేసుకుంటాం' అని గిల్ తెలిపాడు. మొత్తంగా, గిల్‌ ఈ మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలను గుర్తించి, వాటిని సరిదిద్దకుంటే మళ్లీ అనేక విజయాలు సాధిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ఒకే సెంచరీ.. పలు రికార్డులు బద్దలు

ఐపీఎల్ 2026: తొలి సెంచరీపై తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు

Updated Date - Apr 21 , 2026 | 01:00 PM