సమ్మె చేస్తున్నాం.. డిమాండ్లను పరిష్కరించాల్సిందే: ఆర్టీసీ జేఏసీ చైర్మన్
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:38 PM
సమ్మెకు అన్ని సంఘాలూ మద్దతు తెలిపాయని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. ఇప్పటివరకు ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం తమను చర్చలకు పిలవలేదని.. కనీసం సమ్మె నివారణ చర్యలూ చేపట్టలేదని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు సిద్ధమైంది. డిమాండ్లను పరిష్కరించాలంటూ రేపటి (బుధవారం) నుంచి సమ్మె చేయాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. రేపటి(ఏప్రిల్ 22) నుంచి సమ్మె చేపడుతున్నామని.. సమ్మెకు అన్ని సంఘాలూ మద్దతు తెలిపాయని అన్నారు. ఇప్పటివరకూ ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం తమను చర్చలకు పిలవలేదని.. కనీసం సమ్మె నివారణ చర్యలు కూడా చేపట్టలేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలని అడుగుతున్నా.. పట్టించుకోలేదని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టి మరీ ప్రభుత్వం విస్మరించిందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అన్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేయాల్సి వస్తోందని వెంకన్న చెప్పారు. ఈవీ బస్సులు తెస్తూ హైదరాబాద్ డిపోల్లో ఉన్న ఉద్యోగులను జిల్లాలకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం.. ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర చేస్తోందన్నారు. కార్మికులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తోందని చెప్పారు.
‘ఎవరూ భయపడొద్దు.. కార్మికులు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. గత ప్రభుత్వం వేసిన కమిటీపై మీకేం సంబంధం. కాలయాపన కోసమే కమిటీ అంటున్నారు’ అంటూ ఆయన విరుచుకుపడ్డారు. మెట్రో రైల్ వ్యవస్థను వెంటనే విలీనం చేశారని... కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఎందుకు ఇబ్బందని ప్రశ్నించారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే జేఏసీ సిద్ధంగా ఉందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
అప్పుడు బీఆర్‌ఎస్‌కు.. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏటీఎంలా కాళేశ్వరం: బండి సంజయ్
బీఆర్‌ఎస్ నేతలకు మంత్రి వాకిటి శ్రీహరి సవాల్
Read Latest Telangana News And Telugu News