Share News

కాలుష్య రహిత దీపావళి.. కోహ్లీతో ప్రచారం చేయించండి: సుప్రీంకోర్టు

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:52 PM

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బాణసంచా రహిత దీపావళిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకోసం భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి సెలబ్రెటీల సాయం తీసుకోవాలని అధికారులకు సలహా ఇచ్చింది.

కాలుష్య రహిత దీపావళి.. కోహ్లీతో ప్రచారం చేయించండి: సుప్రీంకోర్టు
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బాణసంచా రహిత దీపావళిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకోసం భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి సెలబ్రెటీల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సలహా ఇచ్చింది. ప్రముఖ క్రీడాకారులు, ప్రజాదరణ ఉన్న వ్యక్తులతో ప్రచారం చేయిస్తే ప్రజల్లో అవగాహన పెరుగుతుందని అభిప్రాయపడింది.


బాణసంచా కాలుష్యం, వాటి నియంత్రణకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ‘కాలుష్య రహిత ఢిల్లీ కోసం విరాట్ కోహ్లీ వంటి ప్రముఖ క్రికెటర్లను సంప్రదించండి. వారు ముందుకొచ్చి దీపావళిని వెలుగుల పండుగగా, కాలుష్యరహితంగా జరుపుకోవాలనే సందేశంతో వీడియోలు లేదా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందించవచ్చు’ అని సుప్రీం ధర్మాసనం అధికారులకు సూచించింది.


బాణసంచాతో ఆరోగ్యానికి ముప్పు

బాణసంచా కాల్చడం వల్ల విషపూరిత వాయువులు, ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి కణాలు విడుదలవుతున్నాయని అమికస్ క్యూరీ అపరాజితా సింగ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇవి రక్తప్రవాహంలోకి చేరి శరీర అవయవాలపై ప్రభావం చూపుతాయని తెలిపారు. చిన్నారులు, పొగతాగని వారిలోనూ ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని వివరించారు. మరోవైపు బాణసంచా తయారీని పూర్తిగా నిషేధించాలని పిటిషనర్ గోపాల్ శంకరనారాయణన్ కూడా కోర్టును కోరారు. బాణసంచా వల్ల కలిగే కాలుష్యం ప్రజల జీవించే హక్కుకు భంగం కలిగిస్తోందని వాదించారు. ఈ పరిణామాల దృష్ట్యా కాలుష్య రహిత ఢిల్లీ కోసం విరాట్ వంటి ప్రముఖుల సాయం తీసుకోవాలని సూచించింది.


ఇవి కూడా చదవండి:

డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..

28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు

Updated Date - Oct 30 , 2026 | 12:52 PM