Share News

డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..

ABN , Publish Date - Oct 29 , 2026 | 08:39 PM

మహిళా క్రికెటర్ తనీషా సింగ్‌ను నిన్న జరిగిన మహిళల ప్రిమియర్ లీగ్ వేలంలో ఎవరు కొనుగోలు చేయలేదు. అయితే తాజాగా మహిళల టీ20 చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శన చేసింది తనీషా.

డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..
Tanisha Singh

స్పోర్ట్స్ డెస్క్: చాలా మంది క్రికెటర్లు వివిధ లీగ్స్ నిర్వహించే వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోతుంటారు. ఇందులో కొత్త ఏమిలేదు.. అనేక మంది ప్లేయర్లు ఈ జాబితాలోనే ఉంటారు. అయితే అన్‌సోల్ట్ అయినా తర్వాత కొందరు వార్తల్లో నిలుస్తుంటారు. కారణం.. ఆ తర్వాత జరిగే మ్యాచుల్లో సదరు ప్లేయర్ల అద్భుత ప్రదర్శన, వారు సృష్టించిన రికార్డులు. అలానే వార్తలు నిలిచింది మహిళా క్రికెటర్ తనీషా సింగ్. నిన్న(బుధవారం) జరిగిన మహిళల ప్రిమియర్ లీగ్ వేలంలో తనీషాను ఎవరు కొనుగోలు చేయలేదు. ఈక్రమంలో తాజాగా మహిళల టీ20 చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శన చేసింది.


సీనియర్ మహిళా టీ20 ట్రోఫీలో హైదరాబాద్ జట్టుపై ఢిల్లీ 108 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. పుణేలోని గహుంజే ఎమ్‌సిఎ గ్రౌండ్-2 వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 262 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దేశవాళీ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇదే అత్య‌ధిక స్కోర్ కావడం గమనార్హం. గతంలో ఈ రికార్డు గోవా పేరిట ఉండేది. 2019-20 సీజన్‌లో అరుణాచల్ ప్రదేశ్‌పై గోవా 2 వికెట్ల న‌ష్టానికి 257 ప‌రుగులు సాధించింది.


తాజా మ్యాచ్‌తో గోవా ఆల్‌టైమ్ రికార్డును ఢిల్లీ బ్రేక్ చేసింది. ఢిల్లీ భారీ స్కోర్ సాధించడంలో తనీషా సింగ్ కీలక పాత్ర పోషించింది. కేవలం 47 బంతుల్లోనే 25 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 119 పరుగులు చేసింది. తనీషా 38 బంతుల్లోనే సెంచరీ సాధించింది. మహిళల టీ20 క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీల్లో ఇది మూడోది. భారత్‌కే చెందిన కిరణ్ నవ్‌గిరె 34 బంతుల్లో శతకం పూర్తి చేసి.. వేగవంతమైన సెంచరీ చేసిన వారి జాబితాలో తొలిస్థానంలో ఉంది.


మరోవైపు బుధవారం జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలోకి తనీషా రూ.10 లక్షల కనీస ధరతో వచ్చింది. కానీ, ఏ ఫ్రాంఛైజీ కూడా ఆమెను తీసుకునేందుకు ముందుకు రాలేదు. తాజాగా ప్రదర్శనతో ఇలాంటి ప్లేయర్‌నా మనం వదిలేసిందని ఆయా ఫ్రాంచైజీలు బాధపడుతుంటాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డబ్ల్యూపీఎల్ వేలంలో కేవలం 27 మంది ప్లేయర్లను మాత్రమే ఫ్రాంచైజీలు తీసుకున్నాయి.


ఇవి కూడా చదవండి:

ఊటీ రైలు మార్గం సిద్ధం

కులం, మతం, డబ్బుతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారు: వెంకయ్య నాయుడు..

Updated Date - Oct 29 , 2026 | 08:43 PM