ఘనంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 కర్టెన్ రైజర్.. కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే..
ABN , Publish Date - Oct 29 , 2026 | 08:15 PM
వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు భారతీయులందరూ కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 కర్టెన్ రైజర్ కార్యక్రమం ఢిల్లీ వేదికగా ఘనంగా జరుగుతోంది.
ఢిల్లీ: వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు భారతీయులందరూ కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమం ఢిల్లీ వేదికగా ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం దసరా, కర్వా చౌత్, దీపావళి పండుగల రోజులు నడుస్తున్నాయని అన్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026తో మరో పండుగ వచ్చిందని పేర్కొన్నారు. 700 ఏళ్ల క్రితమే కాకతీయ గణపతి చక్రవర్తి నౌకా వాణిజ్యంపై మోటుపల్లి శాసనం వేయించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నాడే వ్యాపారులు తమ పెట్టుబడులకు భద్రత, విధాన నిర్ణయాల్లో స్థిరత్వాన్ని కోరుకున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తలూ అవే కోరుకుంటున్నారని పీయూష్ గోయల్ వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ప్రపంచంలోని మొదటి ఐదు ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఊహించిన దానికంటే దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి సాధిస్తోందని తెలిపారు. ప్రస్తుతం మధ్య ఆసియా సంక్షోభం వంటి అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, సంప్రదాయ అంచనాలు, ఊహలను అధిగమించి ఎగుమతులను పెంచామని వెల్లడించారు. మరోవైపు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని సీఎం రేవంత్ పెట్టుకోవడాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: భట్టి విక్రమార్క
నిమ్స్, ఉస్మానియా నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: మంత్రి రాజనర్సింహ