Share News

‘ఢిల్లీని స్తంభింపజేయడం సమంజసమేనా?’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 09 , 2026 | 03:15 PM

ఢిల్లీలో సీజేపీ నిరసన నేపథ్యంలో 57 మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరుల ప్రాథమిక హక్కులు, నిరసన హక్కుల మధ్య సమతుల్యత పాటించాలని పేర్కొంది.

‘ఢిల్లీని స్తంభింపజేయడం సమంజసమేనా?’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court On Capital Curbs Ahead Of CJP Protest

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో రేపు(శనివారం) కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసన చేపట్టనున్న తరుణంలో అధికారులు ఆంక్షలు విధించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనకు హాజరయ్యే వారిని నియంత్రించేందుకు నగరాన్నంతా స్తంభింపజేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. పౌరుల ప్రాథమిక హక్కులు, నిరసనకారుల హక్కుల మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరాన్ని న్యాయస్థానం నొక్కిచెప్పింది.


ఈ మేరకు శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దుపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. న్యాయస్థానం దీనిపై జోక్యం చేసుకోవాలని కోరారు. ఇది శాంతియుత నిరసన అని, ప్రజలు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. మరో సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ మాట్లాడుతూ.. అసమర్థత కారణంగా నగరం మొత్తాన్నీ బంద్ చేయలేరని వ్యాఖ్యానించారు.


కాగా.. సీజేపీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. రాజధానికి వచ్చే పలు రైళ్లను రద్దు చేయడం సహా నిరసనకు అనుమతినిచ్చేందుకు నిరాకరించారు. అయితే నిరసనకు సంబంధించి పోలీసుల సూచనలు, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(BNSS)లోని సెక్షన్ 163 అమలుపై నోటీసులు, రైళ్ల రద్దు, యాప్ ఆధారిత ట్యాక్సీలపై ఆంక్షలకు సంబంధించిన మీడియా కథనాలతో కూడిన 16 పేజీల పత్రాన్ని న్యాయస్థానానికి సమర్పించారు ‌‌పిటిషనర్లు. మతపరమైన ప్రార్థనా స్థలాలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను పోలీసులు సంప్రదించడం, హోటళ్లు, హాస్టళ్లలో తనిఖీలు చేపట్టడం వంటి అంశాలనూ ప్రస్తావించారు. ఈ విషయమై జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ స్పందిస్తూ.. నిరసన తెలిపే హక్కులను సమర్థి్స్తూనే అవి పూర్తిగా చట్టబద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. కానీ ఆ నిరసనల్ని అనుమతితోనే నిర్వహించాలన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే అందుకు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.


ఆంక్షలను పూర్తిగా తొలగిస్తే నిరసన తెలిపే వారి హక్కులను కూడా ప్రభావితం చేసే అవకాశముందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇరువర్గాల వాదనలు, వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా సమతుల్య నిర్ణయానికి రావడం సాధ్యంకాదని పేర్కొంది. ఒకవైపు ప్రాథమిక హక్కులు కోరుతున్న పౌరులు తమ ఎదుట ఉన్నారన్న ధర్మాసనం.. మరోవైపు నిరసన చేపట్టాలనుకుంటున్న వారి వివరాలు మాత్రం తమవద్ద లేవని తెలిపింది. ఈ నేపథ్యంలో నిరసనకారుల వివరాలు, ఎంతమంది పాల్గొంటారనే వివరాలు సమర్పించాలని కోరింది. సంబంధిత అన్ని వివరాలతో న్యాయస్థానానికి హాజరవుతామని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు.


ఇవీ చదవండి:

భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినందుకే తొలగించారు: ఏఐ ఉద్యోగులు

ఢిల్లీలో 10 గంటల పాటు రైళ్ల రాకపోకలు రద్దు: భారతీయ రైల్వే

Updated Date - Oct 09 , 2026 | 03:15 PM