Share News

ఢిల్లీలో హైఅలర్ట్.. పర్యటనలు రద్దు చేసుకుని రంగంలోకి దిగిన అమిత్ షా

ABN , Publish Date - Oct 09 , 2026 | 10:15 AM

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది.

ఢిల్లీలో హైఅలర్ట్.. పర్యటనలు రద్దు చేసుకుని రంగంలోకి దిగిన అమిత్ షా

ఢిల్లీ, అక్టోబర్ 09: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీ నగరంలో హైఅలర్ట్ ప్రకటించింది. నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. అందుకోసం భారీగా పోలీసులు, భద్రతా బలగాలను మోహరించింది.

దేశంలోని వివిధ రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ నుంచి దాదాపు 7 వేల మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఇప్పటికే ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ వ్యాప్తంగా 20 వేలకు పైగా పోలీసు, పారా మిలటరీ బలగాలతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఏమైనా అల్లర్ల జరిగితే.. గుంపులను చెదరగొట్టేందుకు యాంటీ రైట్ ఆయుధాలతో బలగాలు రంగంలోకి దింపారు.


మరో వైపు ఢిల్లీలోని భద్రతా పరిస్థితిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అందుకోసం వివిధ రాష్ట్రాల పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. శనివారం సీజేపీ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో పరిస్థితిపై అత్యున్నత స్థాయి అధికారులతో ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. జంతర్ మంతర్‌ వద్ద సీజేపీ చేపట్టనున్న నిరసనకు అనుమతిని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు నిరాకరించారు. ఆందోళనకు అనుమతి లేదని సీజేపీకి ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలులో ఉందని తెలిపారు.


ఇంకో వైపు సోషల్ మీడియాపై నిఘా పెట్టారు. నిరసనల పేరుతో ఉద్రిక్తతలు సృష్టించే తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా సిబ్బంది ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఢిల్లీ సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు నిఘా నీడలో వెళ్లాయి.


ఢిల్లీ ప్రజలను హెచ్చరించిన పోలీసులు

శనివారం సీజేపీ నిరసనలు చేపట్టనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు డీసీపీ సృష్టి పాండే సూచించారు. విధులకు వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ నిరసనల్లో పాల్గొన వద్దని ప్రజలకు తెలిపారు. మీ భద్రతతోపాటు కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు తెలిపారు. శుక్ర, శనివారాల్లో ఢిల్లీ నగరంలో మద్యం దుకాణాలు మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్టార్‌లింక్ వివాదంపై రాహుల్ గాంధీకి మస్క్ స్పందన.. 'ఇది నిజంగా ఆందోళనకరం'

మహాత్మా.. మోదీ, జ్ఞానేశ్‌లకు సద్బుద్ధి ప్రసాదించు!

Updated Date - Oct 09 , 2026 | 10:47 AM