మహాత్మా.. మోదీ, జ్ఞానేశ్‌లకు సద్బుద్ధి ప్రసాదించు!
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:24 AM
‘ఓ బాపూ ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌లకు మంచి బుద్ధిని ప్రసాదించు’ అంటూ మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్ద ఇండి కూటమి నేతలు వినూత్నంగా నిరసన చేపట్టారు.
రాజ్‌ఘాట్ వద్ద ఇండి కూటమి వినూత్న నిరసన.. మహాత్ముడికి నివాళి అర్పించి..2 గంటలు ధర్నా
మోదీ, అమిత్‌షా, మోహన్ భాగవత్, జ్ఞానేశ్ కుట్రలతో దేశాన్ని హైజాక్ చేశారు
వారికి శిక్షపడటం ఖాయం: రాహుల్‌గాంధీ
ఇండి కూటమి ఎంపీలకు రెస్టారెంట్‌లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన కాంగ్రెస్
అక్కడి నుంచి రాజ్‌ఘాట్‌కు వెళ్లిన నేతలు
పోలీసులపై దాడి చేశారంటూ రాహుల్, ప్రియాంక, నేతలపై మూడు కేసులు నమోదు
సీఈసీ జ్ఞానేశ్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత
న్యూఢిల్లీ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘ఓ బాపూ ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌లకు మంచి బుద్ధిని ప్రసాదించు’ అంటూ మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్ద ఇండి కూటమి నేతలు వినూత్నంగా నిరసన చేపట్టారు. గురువారం మూడు బస్సుల్లో ర్యాలీగా రాజ్‌ఘాట్‌కు వచ్చిన ఇండి కూటమి ఎంపీలు, నేతలు.. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. కొంతసేపు మౌనంగా బైఠాయించారు. అనంతరం బీజేపీ ఓటుచోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ సుమారు రెండు గంటల పాటు ధర్నా చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళన గురువారంతో మూడో రోజుకు చేరుకుంది. కాగా, ఈ అంశంలో ఇండి కూటమి నేతలు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. కానీ రాష్ట్రపతి కార్యాలయం ఇంకా సమయాన్ని కేటాయించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
మూడో రోజూ విందు.. నిరసనలు..
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలంటూ ప్రతిపక్ష ఇండి కూటమి చేపట్టిన ఉద్యమానికి విందు రాజకీయాలతో ఊపు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బుధవారం ప్రతిపక్షాల ఎంపీలకు సాగర్‌రత్న హోటల్‌లో విందు ఇచ్చి, తర్వాత అంతా కలిసి ఆందోళనకు వెళ్లిన తరహాలోనే.. గురువారం కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు ఇచ్చారు. సెంట్రల్ ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో మోయెట్స్ రెస్టారెంట్‌లో ఇండి కూటమి ఎంపీలు, నేతలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం మూడు బస్సుల్లో రాజ్‌ఘాట్‌కు బయలుదేరారు.బుధవారం గైర్హాజరైన ఎస్పీ, శివసేన-యూబీటీ, ఎన్సీపీ-ఎస్పీ నేతలు గురువా రం విందుకు హాజరై, ఆందోళనలో పాల్గొన్నారు. ఇందులో ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, మరికొందరు కాంగ్రెస్ ఎంపీలతోపాటు టీఎంసీ, ఎస్పీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ ఎంపీలు, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, హిమాచల్ సీఎం సుఖ్విందర్‌సింగ్ సుఖు కూడా విందులో పాల్గొన్నారు.
రాహుల్, ప్రియాంకపై 3 కేసులు నమోదు
బుధవారం ఢిల్లీలోని షాంగ్రీలా హోటల్ సమీపంలో పోలీసులపై దాడి చేశారంటూ రాహుల్, ప్రియాంక, మరికొందరు నేతలపై ఢిల్లీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. మంగళవారం అనుమతి లేకుండా ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి ప్రవేశించడం, అధికారిక విధులను అడ్డుకోవడం, పోలీసులపై దాడి, దురుసుగా ప్రవర్తించడం తదితర ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు.
రాహుల్ మహిళా పోలీసును అనుచితంగా తాకారు: బీజేపీ
ఇండి కూటమి నిరసనల సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక పోలీసులతో అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ అధికార ప్రతినిధులు ప్రదీప్ భండారీ, సిద్ధార్థ్ యాదవ్ ఆరోపించారు. రాహుల్ గాంధీ ఓ మహిళా కానిస్టేబుల్‌ను అనుచితంగా తాకారని, ప్రియాంకా గాంధీ ఓ మహిళా పోలీసు అధికారిని కడుపులో కొట్టారని.. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులను కిందపడేసి, కాళ్లతో తన్నారన్నారు.
ఆ నలుగురికీ శిక్ష పడుతుంది: రాహుల్
జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆపే ప్రసక్తే లేదని, ఆయనను తప్పించడం మినహా ప్రధాని మోదీ, అమిత్‌షా చేసేదేమీ లేదని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. దేశంలో పవిత్రమైన ఓటు హక్కు కోసమే తాము పోరాడున్నామని చెప్పారు. ‘‘300 మంది ఎంపీలం ప్రశాంతంగా ఆందోళన చేయాలనుకుంటున్నాం. మొదటి రోజు ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళుతుంటే అడ్డుకున్నారు. నిన్న జంతర్‌మంతర్‌కు వెళుతుంటే ఆపేశారు. మా వాళ్లను కొట్టారు. వాళ్లకు శిక్షపడుతుంది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్‌షా, మోహన్ భాగవత్, జ్ఞానేశ్‌కుమార్ కుట్రలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి ఓటు చోరీకి పాల్పడ్డారు. కుట్రలతో దేశాన్ని హైజాక్ చేశారు. వారిని న్యాయస్థానం ముందు నిలబెడతాం. వారికి శిక్షపడటం ఖాయం...’’ అని రాహుల్ పేర్కొన్నారు. కాగా, విపక్షాల ఆందోళనలు, కాక్రోచ్ జనతా పార్టీ ఈ నెల 10వ తేదీ నుంచి నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో కేంద్రం ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ పోలీసులతోపాటు 221 కంపెనీల పారామిలటరీ దళాలను రంగంలోకి దింపింది.
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు భద్రత పెంపు
ఇండి కూటమి ఆందోళనలు, కాక్రోచ్ పార్టీ కూడా నిరసనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు కేంద్రం భద్రతను మరింత పెంచింది. ఇప్పటికే ఆయనకు అత్యుత్తమమైన జెడ్ ప్లస్ భద్రత ఉండగా.. సిబ్బందిని మరింత పెంచారు. సీఆర్‌పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని జోడించారు. ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద 24 గంటలు పోలీసు బందోబస్తు చేపట్టారు. పారామిలటరీ సిబ్బందిని మోహరించారు. ఈసీ ప్రధాన కార్యాలయం ‘నిర్వాచన్ సదన్’ వద్ద కూడా భద్రత పెంచారు.
జూలై 20 నాటి సీజేపీ ఆందోళనలపై ఎఫ్‌ఐఆర్
జంతర్‌మంతర్ వద్ద జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు జరిగిన ఆందోళనల్లో హింసకు దారితీసిన పరిస్థితులు, దాని వెనుక కుట్రకోణంపై ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ హింస వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? దానికి ప్రేరేపించినవారు ఎవరు? నేరచరిత్ర ఉన్న వ్యక్తులు నిరసన ప్రదేశాల్లోకి చొరబడ్డారా? ముందస్తు ప్రణాళికతో విధ్వంసానికి, హింసకు పాల్పడ్డారా? అనే అంశాలపై దర్యాప్తు సాగుతుందని పోలీసువర్గాలు తెలిపాయి. ఆందోళనల సమయంలో అక్కడున్న ప్రతి వ్యక్తి పాత్రను గుర్తించడం, హింసకు ముందు, తర్వాత పంపుకొన్న సందేశాలను పరిశీలించడం కూడా దర్యాప్తులో భాగమని వెల్లడించాయి. సీఈసీ రాజీనామా డిమాండ్‌తో శనివారం (10వ తేదీన) జంతర్‌మంతర్ వద్ద ఆందోళన నిర్వహించనున్నట్టు సీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఎఫ్‌ఐఆర్ నమోదుకావడం గమనార్హం.