Share News

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి చుక్కెదురు

ABN , Publish Date - Sep 21 , 2026 | 04:05 PM

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి చుక్కెదురైంది. ఆమె ఓటరు నమోదు వివాదంలో ఢిల్లీ సెషన్స్ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి చుక్కెదురు
Sonia Gandhi

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ సెషన్స్ కోర్టులో కాంగ్రెస్ నేత సోనియా గాంధీకి చుక్కెదురైంది. ఆమె ఓటరు నమోదు వివాదంలో ఢిల్లీ సెషన్స్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన ఫిర్యాదును కొట్టివేస్తూ మేజిస్ట్రేట్‌ కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది. ఆ ఉత్తర్వులో తగిన కారణాలు లేవని పేర్కొంటూ.. ఫిర్యాదును చట్ట ప్రకారం.. మరోసారి పరిశీలించి, సరైన కారణాలతో కూడిన ఉత్తర్వులివ్వాలని మేజిస్ట్రేట్‌ కోర్టును ఆదేశించింది.


సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఓటరు జాబితాలో ఆమె పేరు నమోదైందని న్యాయవాది వికాస్‌ త్రిపాఠి తన పిటిషిన్‌లో ఆరోపించారు. ఆమె పేరు 1980లోనే ఢిల్లీ ఓటరు లిస్టులో ఉందని పేర్కొన్న ఆయన.. ఆ తర్వాత 1982లో పేరు తొలగించారని, 1983లో మరలా నమోదైందని వాదించారు. కానీ వాస్తవానికి ఆమె.. 1983లో భారత పౌరసత్వం పొందారని పేర్కొన్నారు. కాగా.. ఈ ఫిర్యాదును మేజిస్ట్రేట్‌ కోర్టు గతంలో తిరస్కరించింది. దీంతో ఆయన సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు.


ఈ పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి విశాల్‌ గోగ్నే.. దిగువ కోర్టు ఉత్తర్వులో ఫిర్యాదులోని ఆరోపణలకు అనుగుణంగా తగిన కారణాలేవీ నమోదవలేదని పేర్కొన్నారు. వీటిపై ఢిల్లీ పోలీసుల నుంచి స్టేటస్‌ రిపోర్ట్ కోరేందుకు తగిన అవకాశం ఇవ్వకుండానే మేజిస్ట్రేట్‌ తిరస్కరించిందన్నారు. దీంతో దర్యాప్తు అధికారి స్పందనను పూర్తిగా పరిశీలించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం అభిప్రాయపడింది. అందువల్ల ఫిర్యాదును తిరిగి మేజిస్ట్రేట్‌ కోర్టుకే పంపిస్తూ, ఈ అంశాన్ని కొత్తగా పరిశీలించాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 29కు వాయిదా వేసింది.


ఇవీ చదవండి:

ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు బుల్డోజర్లతో స్వాగతం

సాహిల్ సూసైడ్ కేసు.. క్షమాపణ చెప్పిన ఐఐటీ బాంబే యాజమాన్యం

Updated Date - Sep 21 , 2026 | 05:16 PM