డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 28 , 2026 | 03:29 PM
డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని స్పష్టం చేశారు.
ఢిల్లీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): డీలిమిటేషన్ బిల్లుపై (Delimitation Bill) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని స్పష్టం చేశారు. ఈరోజు (శనివారం) ఢిల్లీ వేదికగా మీడియాతో ఖర్గే మాట్లాడారు. ఈ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నేతలంతా ఉమ్మడిగా నిర్ణయించామని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచి, అధికారాన్ని కేంద్రీకరించుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గత ఎన్నికల్లో బీజేపీ 400 సీట్ల లక్ష్యంతో ముందుకు వెళ్లిందని తెలిపారు. ఇప్పుడు లోక్సభ స్థానాల సంఖ్యను 850కు పెంచి '800 పార్' అని లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. అధికారాన్ని చేజిక్కించుకుని, నిరవధికంగా కొనసాగించుకునేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు.
అధికారం కోసమే లోక్సభ సీట్లను పెంచుతున్నారు..
డీలిమిటేషన్ బిల్లుపై ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుందని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. పార్లమెంట్లో ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న బిల్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని స్పష్టం చేశారు. శాశ్వతంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ చేతుల్లో అధికారం ఉండాలని చూస్తున్నారని ఆగ్రహించారు. ఇండియా కూటమి పార్టీలన్నీ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకిస్తాయని తెలిపారు. అధికారం కోసమే లోక్సభ సీట్లను మోదీ సర్కార్ పెంచుతోందని ధ్వజమెత్తారు. ఎప్పటికీ అధికారం తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ నేతలు చూస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల వారి గురించి బిల్లులో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీల సీట్లు ఎందుకు పెరగట్లేదు..
డీలిమిటేషన్ ద్వారా పెరిగే సీట్లలో ఎస్సీ, ఎస్టీల సీట్లు ఎందుకు పెరగట్లేదని మల్లికార్జున ఖర్గే నిలదీశారు. 2026 జనగణన వివరాలు రాబోతున్నాయని అన్నారు. తాజా జనగణన ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ సీట్లు వస్తాయని వెల్లడించారు. వారికి ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వకుండా చేయడానికి మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని విరుచుకుపడ్డారు. పదికోట్లకు పైగా ఓట్లను ‘సర్’ ప్రక్రియ ద్వారా తొలగించారని మండిపడ్డారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలో డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే ఇంకా అవకతవకలు పెరుగుతాయని ఆరోపించారు. పారదర్శకంగా ఎన్నికలు జరిపేందుకు జ్ఞానేశ్ కుమార్ సిద్ధంగా లేరని అన్నారు.
బీజేపీకి అనుకూలంగా డీ లిమిటేషన్ ప్రక్రియ..
జమ్మూ కశ్మీర్, అస్సాంలో డీ లిమిటేషన్ ప్రక్రియ బీజేపీకి అనుకూలంగా జరిగిందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఆయా నియోజకవర్గాల కేటగిరిని వారికి నచ్చినట్లుగా మార్చే అవకాశం ఉంటుందని తెలిపారు. టీఎంసీ, ఎన్సీపీ, శివసేనను విచ్ఛిన్నం చేసిన వారికి కావలసిన నంబర్ వచ్చే వరకు చూశారని అన్నారు. డీ లిమిటేషన్లో 850 సీట్లు పెరిగితే దేశానికి చాలా నష్టం జరుగుతుందని చెప్పుకొచ్చారు. గతంలో చార్సౌపార్ అని అన్నారని.. ఇప్పుడేమో ఆట్సౌపార్ అని అధికారంలో ఉండాలని బీజేపీ నేతలు చూస్తున్నారని మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని జగన్ అండ్ కో ఎగతాళి చేస్తున్నారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
రాజకీయ విభేదాలకు అతీతంగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలి: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telangana NewsAnd National News
And Telugu News