Share News

కేరళ మాజీ సీఎం విజయన్‌కు షాక్.. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు హైకోర్టు ఆదేశం

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:49 PM

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన కుమార్తె వీణాకు చెందిన ఐటీ సంస్థలో అక్రమ లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలపై.. విజయన్ సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

కేరళ మాజీ సీఎం విజయన్‌కు షాక్.. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు హైకోర్టు ఆదేశం
Kerala HC directs FIR against former CM Pinarayi Vijayan

ఇంటర్నెట్ డెస్క్: కేరళ మాజీ సీఎం, సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన కుమార్తె వీణాకు చెందిన ఐటీ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కు కొచ్చి మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్(సీఎంఆర్‌ఎల్‌) నుంచి అక్రమ చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలపై.. విజయన్ సహా వీణా, ఆమె భర్త, మాజీ మంత్రి మహమ్మద్ రియాస్‌ తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కేరళ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు జస్టిస్ బదరుద్దీన్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం రాష్ట్ర విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగాలకు ఉత్తర్వులు జారీ చేసింది.


2017-18, 2018-19 ఆర్థిక ఏడాదుల్లో సాఫ్ట్‌వేర్, కన్సల్టెన్సీ సేవల పేరుతో ఎక్సాలాజిక్‌కు సుమారు రూ.1.72 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే.. 2023లో ఆదాయపు పన్ను శాఖ(ACB) అధికారులు సోదాలు చేపట్టి ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(SFIO) దర్యాప్తు చేపట్టాయి. ఈ వ్యవహారంలో ఎక్సాలాజిక్‌ సంస్థ మొత్తం రూ.2.73 కోట్లు పొందిందని ఎస్‌ఎఫ్‌ఐఓ అంచనా వేసింది.


కాగా.. ఈ కేసులో విజయన్‌, వీణా, రియాస్ తదితరులపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని తొలుత ఈడీ సిఫార్సు చేసింది. అయితే.. నేరుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా కాంగ్రెస్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్‌తో ప్రాథమిక విచారణకు ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం వీఎస్.అచ్యుతానందన్ వద్ద అదనపు ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేసిన కేఎం.షాజహాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. అయితే.. వీణా, ఎక్సాలాజిక్ సంస్థలు ఎలాంటి తప్పు చేయలేదని.. సదరు చెల్లింపులు చట్టబద్ధమైన వ్యాపార ఒప్పందాల్లో భాగమేనని సీపీఎం చెప్పుకొచ్చింది. కేవలం రాజకీయ ప్రలోభాల కారణంగానే ఈడీ సోదాలు జరిపిందని ఆరోపించింది.


మరోవైపు విజయన్ గతంలో విద్యుత్ మంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఎస్‌ఎన్‌సీ లావలిన్ కేసులోనూ ఆయనపై సీబీఐ దర్యాప్తు జరిగింది. 1995-97 మధ్య కేరళలోని జలవిద్యుత్ ప్రాజెక్టుల ఆధునికీకరణ కోసం కెనడాకు చెందిన ఎస్‌ఎన్‌సీ లావలిన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంతో రాష్ట్ర ఖజానాకు రూ.374.50 కోట్ల నష్టం వాటిల్లిందనే అభియోగాలపై నిందితుడిగా ఉన్నారు విజయన్.


ఇవీ చదవండి:

‘ఢిల్లీని స్తంభింపజేయడం సమంజసమేనా?’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినందుకే తొలగించారు: ఏఐ ఉద్యోగులు

Updated Date - Oct 09 , 2026 | 04:59 PM