కర్ణాటక బీజేపీ వినూత్న నిరసన.. ఏఐ వీడియోతో కాంగ్రెస్‌పై విమర్శలు!
ABN , Publish Date - Nov 06 , 2026 | 05:16 PM
కర్ణాటకలో బస్సు ఛార్జీలు, పాల ధరల పెంపును నిరసిస్తూ బీజేపీ వ్యంగ్య ఏఐ యానిమేటెడ్ వీడియో విడుదల చేసింది. సీఎం డీకే శివకుమార్‌ను స్కూల్ బాయ్‌గా చూపిస్తూ 38 సెకన్ల వీడియోలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలో పాల ధరలు, బస్సు చార్జీల పెంపుపై రాజకీయ వేడి రాజుకుంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష బీజేపీ వినూత్న ప్రచారానికి తెరలేపింది. సీఎం డీకే శివకుమార్‌ను స్కూల్ బాయ్‌గా చూపిస్తూ వ్యంగ్యంగా రూపొందించిన ఓ ఏఐ యానిమేటెడ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
38 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో బాలుడి రూపంలో ఉన్న శివకుమార్.. పాలు తీసుకురమ్మంటే ధర ఎక్కువైందని, ఫ్యాన్ వేయమంటే విద్యుత్ బిల్లు భారమైందని సమాధామిస్తున్నాడు. బస్సు టికెట్, మందుల ధరలు కూడా అమాంతం ఎగబాకాయని వాపోతున్నాడు. రోడ్లు వేయమంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని జేబులు చూపిస్తున్నాడు. చివరగా వసూళ్లకు దిగమని చెప్పగా.. ఆ చిన్నారి ఉత్సాహంగా కనిపించేలా కాంగ్రెస్ నేతలపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
కాగా.. ఆ రాష్ట్రంలో ఇటీవల బస్సు ఛార్జీలను పెంచడంపై బీజేపీ ఆందోళనలు చేపట్టింది. సాధారణ, ఎక్స్‌ప్రెస్ బస్సుల ఛార్జీలను కేఎస్‌ఆర్‌టీసీ, ఎన్‌డబ్ల్యూకేఆర్‌టీసీ, కేకేకేఆర్‌టీసీలు సగటున 23 శాతం పెంచగా.. బెంగళూరు బీఎంటీసీ 33 నుంచి 35 శాతం వరకు పెంచింది. మరోవైపు నందిని పాలు, పెరుగు ధరల పెంపుపైనా ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న శక్తి పథకం కారణంగా రవాణా సంస్థలపై ఆర్థిక భారం పెరిగిందని ప్రభుత్వం చెబుతుండగా.. ఆర్థిక నిర్వహణలో లోపాలను సరిచేయకుండా ప్రజలపై భారం మోపడం సరికాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు.. ధరల పెంపును ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధరల పెంపుపై ఇప్పుడు బీజేపీ విడుదల చేసిన ఏఐ వీడియో ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఇవీ చదవండి:
తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో షాక్.. దీపావళి బెయిల్ పిటిషన్ తిరస్కరణ
వేములవాడలో అమానుషం.. బతికుండగానే శ్మశానానికి తరలింపు