Share News

అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. జల్సాలో పోలీసుల తనిఖీలు..

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:04 PM

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసానికి మరోసారి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ముంబైలోని జుహూలో ఉన్న ఆయన నివాసం 'జల్సా'ను పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపించారు.

అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. జల్సాలో పోలీసుల తనిఖీలు..
Amitabh Bachchan House

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసానికి మరోసారి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ముంబైలోని జుహూలో ఉన్న ఆయన నివాసం 'జల్సా'ను పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపించారు. శుక్రవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు జల్సాతో పాటు బెదిరింపు సందేశంలో పేర్కొన్న ఇతర ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడా అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు (Amitabh Bachchan House).


అమితాబ్ బచ్చన్‌ ఇంటికి బాంబు బెదిరింపు రావడం ఇది రెండోసారి. అక్టోబర్ 23న కూడా ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు ఈమెయిల్ పంపించారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 మధ్య జుహూలోని జల్సాపై దాడి చేస్తామని అందులో హెచ్చరించారు. అంతేకాకుండా ఓ పాఠశాలపై గ్రెనేడ్ దాడి జరిగే అవకాశం ఉందని, ఖలిస్థాన్ ప్రస్తావన కూడా ఆ సందేశంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా వచ్చిన ఈమెయిల్‌లో అమితాబ్ బచ్చన్ నివాసంతో పాటు బాంబే హైకోర్టు, మహాలక్ష్మి రేస్‌కోర్స్ పేర్లను కూడా ప్రస్తావించారు (Jalsa Bomb Threat).


ఈ నేపథ్యంలో పోలీసులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు (Mumbai Bomb Threat). ఎక్కడా బాంబులు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదు. బెదిరింపు సందేశం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? దీని వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపుల నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ భద్రతను కూడా పెంచారు. ప్రతి ఆదివారం ముంబైలోని జల్సా నివాసం బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేయడం అమితాబ్‌కు చాలా ఏళ్లుగా అలవాటు. అయితే ఇటీవల ఆయన బుల్లెట్‌ప్రూఫ్ అద్దం వెనుక నిలబడి అభిమానులకు అభివాదం చేశారు. కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో పాటు భద్రతా సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

కొనసాగుతున్న లాభాలు.. 1,200 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..


ప్రధానిని కలిసిన సూర్యకుమార్ యాదవ్.. చిన్నారులతో సరదాగా గడిపిన మోదీ..

Updated Date - Nov 06 , 2026 | 05:10 PM