Share News

వేములవాడలో అమానుషం.. బతికుండగానే శ్మశానానికి తరలింపు

ABN , Publish Date - Nov 06 , 2026 | 03:49 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ వైకుంఠ ధామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చనిపోకముందే అతణ్ని శ్మశానానికి తరలించారు కుటుంబ సభ్యులు.

వేములవాడలో అమానుషం.. బతికుండగానే శ్మశానానికి తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 06: మనిషికి కష్టమొస్తే ఆదుకోవాల్సిన సమాజంలో.. కనీసం తలదాచుకునేందుకూ చోటు దొరకని దుస్థితి నెలకొంటే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తిని.. బతికుండగానే శ్మశానానికి తరలించారు కుటుంబ సభ్యులు. ఈ హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకుంది.

వేములవాడకు చెందిన రాకేశ్‌కు అమృత అనే మహిళతో వివాహమైంది. అయితే.. కొంతకాలానికే ఆమె రాకేశ్‌కు విడాకులిచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తల్లితో పాటు ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు రాకేశ్. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాకేశ్‌ను ఇటీవల స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడి వైద్యులు అతణ్ని ఆస్పత్రిలో చేర్చకునేందుకు నిరాకరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న రాకేశ్‌ను కిరాయి ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. ఇంటి యజమాని అనుమతించలేదని తెలుస్తోంది.


దీంతో అప్పటికే దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇక చేసేదేమీ లేక ప్రాణాలతోనే ఉన్న రాకేశ్‌‌ను వేములవాడ వైకుంఠధామానికి తరలించామని వాపోతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి వైద్య సాయం, కనీస ఆశ్రయం అందించాల్సిందిన సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం స్థానికంగా కలకలం రేపింది.


ఇవీ చదవండి:

డమ్మీ తుపాకీ, కత్తులతో బెదిరింపు.. అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్

మీర్‌పేట్ డబుల్ మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్

Updated Date - Nov 06 , 2026 | 04:43 PM