మీర్‌పేట్ డబుల్ మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
ABN , Publish Date - Nov 06 , 2026 | 02:35 PM
హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు మహమ్మద్ సిద్ధిఖీని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 6: మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు మహమ్మద్ సిద్ధిఖీని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి కత్తి, వ్యాగన్-ఆర్ కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 4న అత్తంటికి వెళ్లిన సిద్ధిఖీ.. అత్త, బావమరిది మహమ్మద్ యూసుఫ్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడి అత్త నిరంజన్ బీ, బావమరిది యూసుఫ్ అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే తీవ్రంగా గాయపడిన బావమరది భార్య మహమ్మద్ రేష్మా (39) ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భార్య కుటుంబంతో తలెత్తిన వివాదాలే హత్యలకు కారణంగా పోలీసులు గుర్తించారు. పెద్దల ముందు అవమానించారనే కక్షతో ముగ్గురిని హత్య చేసేందుకు నిందితుడు కుట్రకు ప్లాన్ చేసినట్టు విచారణలో బయటపడింది.
కాగా.. షరీఫ్‌నగర్‌కు చెందిన భార్యాభర్తలు షేక్ మహమ్మద్ సిద్ధిఖీ, నూర్ బేగం మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. తరచూ భర్త గొడవపడుతుండటంతో ఈనెల 4న నూర్ బేగం పుట్టింటికి వెళ్లింది. అదే రోజు ఉదయం తన భర్తతో తమకు ప్రాణహానీ ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయంత్రం సమయంలో అత్తింటికి చేరుకున్న సిద్ధిఖీ.. కత్తితో అత్త, బావమరది, బావమరిది భార్యపై విచారక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అత్త, బావమరిది అక్కడికక్కడే మృతిచెందగా.. బావమరది భార్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
ఇవి కూడా చదవండి...
‘కూకట్‌పల్లిలో ఒక్క ఎకరం అమ్మలేదు’.. ప్రభుత్వానికి ఎమ్మెల్యే మాధవరం సవాల్
తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీలపై ఏఐసీసీకి టీపీసీసీ చీఫ్ నివేదిక
Read Latest Telangana News And Telugu News