Share News

లైంగిక వేధింపుల ఆరోపణలు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు

ABN , Publish Date - Oct 09 , 2026 | 06:44 PM

లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ, జేఎన్‌యూ ప్రొఫెసర్ డా.ఆంగోంచా బిమోల్ అకోయిజమ్‌పై వేటు పడింది. యూనివర్సిటీలోని అంతర్గత కమిటీ విచారణ అనంతరం.. ఆయన్ను దోషిగా తేలుస్తూ, విధుల నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది.

లైంగిక వేధింపుల ఆరోపణలు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు
Professor and Congress MP Dr Angomcha Bimol Akoijam Sacked By JNU

ఇంటర్నెట్ డెస్క్: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(JNU) ప్రొఫెసర్ డా.ఆంగోంచా బిమోల్ అకోయిజమ్‌పై వేటు పడింది. యూనివర్సిటీలోని అంతర్గత కమిటీ విచారణ అనంతరం.. ఆయన్ను దోషిగా తేలుస్తూ, విధుల నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు జేఎన్‌యూ వీసీ, ప్రొఫెసర్ శాంతిశ్రీ డి.పండిట్ ఆయన్ను తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు.


మణిపుర్‌లోని ఇన్నర్ మణిపుర్ లోక్‌సభ ఎంపీ అయిన అకోయిజమ్‌.. తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని 11 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తరగతి గదుల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం, సమావేశాల్లో అసౌకర్యానికి గురిచేసేలా ప్రవర్తించడం, విద్యాపరమైన పరస్పర చర్యల సమయంలోనూ అనుచితంగా ప్రవర్తించారంటూ ఆయనపై ఆరోపణలు చేశారు. తొలుత ఓ విద్యార్థిని వైవా పరీక్షల అనంతరం తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించగా.. ఆ తర్వాత మరికొందరు విద్యార్థినులూ ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.


అయితే.. తనపై వచ్చిన ఆరోపణలను అకోయిజమ్ ఖండించారు. అవి నిరాధారమైనవన్న ఆయన.. ఉద్దేశపూర్వకంగా తనపై అభియోగాలు మోపుతున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు.. బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ.. ఆకోయిజమ్ రాజీనామాను కోరుతూ ఆందోళనలు నిర్వహించింది. ఈ నిరసనలపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్‌ కూడా జేఎన్‌యూ యాజమాన్యాన్ని నివేదిక కోరినట్టు సమాచారం.


ఇవీ చదవండి:

‘ఢిల్లీని స్తంభింపజేయడం సమంజసమేనా?’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కేరళ మాజీ సీఎం విజయన్‌కు షాక్.. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు హైకోర్టు ఆదేశం

Updated Date - Oct 09 , 2026 | 06:44 PM