హౌతీ దాడులతో అలర్ట్.. రియాద్‌కు భారత విమానాల రద్దు
ABN , Publish Date - Oct 08 , 2026 | 08:45 PM
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఎయిర్‌ఇండియా, ఇండిగో, ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు.. రియాద్‌కు వెళ్లే విమానాలను రద్దు చేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఎయిర్‌ఇండియా, ఇండిగో, ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు.. రియాద్‌కు వెళ్లే విమానాలను రద్దు చేశాయి. ఈ నెల 10 వరకు ఈ నిబంధనను అమలు చేస్తున్నట్టు ఆయా సంస్థలు ప్రకటించాయి. సదరు ప్రయాణికులకు టికెట్ సొమ్ము పూర్తిగా రీఫండ్ లేదా అదే టికెట్‌పై ప్రయాణ తేదీ మార్చుకునే వెసులుబాటును కల్పించామని స్పష్టం చేశాయి.
సౌదీలోని విమానాశ్రయాలు, సైనిక స్థావరాలు, చమురు కేంద్రాలపై వరుస దాడులకు పాల్పడుతున్నట్లు ఇరాన్ మద్దతున్న హౌతీలు ఇటీవల ప్రకటించారు. అక్కడి గగనతలంలో విమానాలు నడిపే అంతర్జాతీయ విమానయాన సంస్థలకు గురువారం తెల్లవారుజామున మరోసారి హెచ్చరికలు కూడా జారీచేశారు. సౌదీ గగనతలం తమ సైనిక కార్యకలాపాలకు వేదికగా మారిందన్న హౌతీలు.. అక్కడ విమానాలు నడిపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10 వరకు రియాద్‌కు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు వెల్లడించాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నాయి.
మరోవైపు.. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ప్రయాణికులను అప్రమత్తం చేసింది. గురువారం ఉదయం రాజధాని ప్రాంతంలో వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో.. విమానాశ్రయానికి బయల్దేరే ముందు తమ విమానాల స్థితిగతులను సంబంధిత ఎయిర్‌లైన్స్‌తో నేరుగా సంప్రదించి తెలుసుకోవాలని సూచించింది. కాగా.. రియాద్, అభా విమానాశ్రయాలపై బుధవారం హౌతీలు జరిపిన దాడుల్లో ముగ్గురు మృతిచెందినట్టు సౌదీ అధికారులు వెల్లడించారు. అయితే.. సౌదీ, దాని మిత్రదేశాలకు చెందిన యెమెన్ దళాలు.. హౌతీలపై భారీ స్థాయిలో భూతల, వైమానిక దాడులు చేపట్టాక తొలిసారి ఈ మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి:
సినిమాలు పక్కనపెట్టి సైన్యంలోకి.. కార్గిల్ వీరుడిగా నానా పటేకర్
ఈసీపై ఇండియా కూటమి పోరు.. ‘ముందు లంచ్.. తర్వాత నిరసన’ ఫార్ములా!