Share News

ఈసీపై ఇండియా కూటమి పోరు.. ‘ముందు లంచ్‌.. తర్వాత నిరసన’ ఫార్ములా!

ABN , Publish Date - Oct 08 , 2026 | 03:36 PM

ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌పై ఇండియా కూటమి పోరు కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు చేపట్టిన ఆందోళన మూడో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నారు కూటమి నేతలు!

ఈసీపై ఇండియా కూటమి పోరు.. ‘ముందు లంచ్‌.. తర్వాత నిరసన’ ఫార్ములా!

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌పై ఇండియా కూటమి పోరు కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు చేపట్టిన ఆందోళన మూడో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నారు కూటమి నేతలు! 'ముందు లంచ్.. తర్వాత నిరసన!' అన్నట్టు సాగుతోంది వారి తీరు. బుధవారం సాగర్‌ రత్నలో భోంచేసి ఆందోళనకు బయలుదేరిన విపక్ష నేతల కోసం.. గురువారం మోయెట్స్‌ రెస్టారెంట్‌లో భోజనం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాజ్‌ఘాట్‌కు వెళ్లి నిరసన కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఎంపీలను తీసుకెళ్లేందుకు హోటల్ బయట బస్సులు కూడా సిద్ధం చేశారు. మొత్తంగా ఈసీపై పోరాటం నేపథ్యంలో రెస్టారెంట్లు, నిరసన ప్రదేశాలు మారినా.. లంచ్‌ తర్వాతే ఆందోళన అనే ఫార్ములా మాత్రం యథాతథంగా కొనసాగుతోంది.


కాగా.. బుధవారంనాడు జంతర్‌మంతర్‌ వద్దకు వెళ్లి నిరసన చేపట్టేందుకు యత్నించిన విపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ హైడ్రామాలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో షాంగ్రిలా హోటల్‌ వద్ద.. ప్రియాంక గాంధీ రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని రోడ్డుపై పడుకుని నిరసన తెలపగా.. రాహుల్ పోలీసుల వాహనంలోకి వెళ్లేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో ప్రియాంకతో పాటు రాహుల్‌‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.


మరోవైపు రేపు(ఈ నెల 9న) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సంఘంపై ఫిర్యాదు చేసేందుకు 15 మంది ఎంపీలతో భేటీ కోరగా.. 10 మంది సభ్యుల ప్రతినిధి బృందానికి రాష్ట్రపతి భవన్‌ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ, ఖర్గే, అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, మమతా బెనర్జీ వంటి ప్రముఖ నేతలు ఈ బృందంలో పాల్గొనే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా.. ఇండియా కూటమి నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. జ్ఞానేశ్‌ కుమార్‌ నివాసం, ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద అదనపు బలగాలను మోహరించారు.


ఇవీ చదవండి:

ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసన.. మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తిపై దాడి

చనిపోయే ముందు స్నేహితుడికి మెసేజ్ చేసిన నానా పటేకర్.. అందులో ఏముందంటే.?

Updated Date - Oct 08 , 2026 | 04:42 PM