Share News

సినిమాలు పక్కనపెట్టి సైన్యంలోకి.. కార్గిల్‌ వీరుడిగా నానా పటేకర్‌

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:17 PM

నటుడిగా తెరపై విభిన్న పాత్రలు పోషించిన నానా పటేకర్‌.. నిజ జీవితంలోనూ దేశం కోసం ఎన్నో సేవలు చేశారు. కార్గిల్‌ యుద్ధ సమయంలో తన సినీ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చి మరీ సైన్యంలో చేరారు.

సినిమాలు పక్కనపెట్టి సైన్యంలోకి.. కార్గిల్‌ వీరుడిగా నానా పటేకర్‌

ఇంటర్నెట్ డెస్క్: నటుడిగా తెరపై విభిన్న పాత్రలు పోషించిన నానా పటేకర్‌.. నిజ జీవితంలోనూ దేశం కోసం ఎన్నో సేవలు చేశారు. కార్గిల్‌ యుద్ధ సమయంలో తన సినీ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చి మరీ సైన్యంలో చేరారు. సుమారు 60 రోజులపాటు సైనికులతో కలిసి విధుల్లో పాల్గొ్నారు. 75 ఏళ్ల వయసులో నానా పటేకర్‌ నేడు(గురువారం) గుండెపోటుతో కన్నుమూసిన నేపథ్యంలో ఆయన సైనిక సేవలను స్మరించుకుంటూ..


1980 ఆఖర్లో నానా పటేకర్‌ టెరిటోరియల్‌ ఆర్మీలో చేరారు. 1991లో వచ్చిన 'ప్రహార్‌: ది ఫైనల్‌ అటాక్‌' సినిమాలో ఆర్మీ కమాండో పాత్ర కోసం ఏకంగా మూడేళ్లపాటు మరాఠా లైట్ ఇన్‌ఫెంట్రీలో శిక్షణ తీసుకున్నారాయన. అప్పుడే సైన్యంపై ఆయనకు మరింత ఆసక్తి, అనుబంధం ఏర్పడింది. ఇక.. 1999లో కార్గిల్‌ యుద్ధం ప్రారంభమైన సమయలో సైన్యంలో చేరేందుకు స్వచ్ఛందంగా ఆసక్తి కనబరిచారు. అయితే.. అందుకు రక్షణ శాఖ పర్మిషన్ తప్పనిసరి అని అధికారులు చెప్పడంతో.. నాటి రక్షణ మంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌ను కలిశారు. తనను ముందు వరుసలో సైనికులతో కలిసి సేవ చేసేందుకు అనుమతించాలని మంత్రిని కోరారు పటేకర్. ఈ నేపథ్యంలో తనకున్న షూటింగ్‌ నైపుణ్యం, గతంలో సాధించిన విజయాల గురించి కూడా ప్రస్తావించారు.


పటేకర్ విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందిస్తూ.. సైన్యంలో చేరేందుకు అనుమతి ఇచ్చింది రక్షణ శాఖ. దీంతో అప్పట్లో కెరీర్‌ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ.. సినిమాలకు విరామమిచ్చి ఆర్మీ క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌(క్యూఆర్‌టీ)లో చేరారు పటేకర్. శ్రీనగర్‌, ద్రాస్‌, లెహ్‌ ప్రాంతాల్లో సైనికులతో కలిసి సుమారు 60 రోజులు విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో భిన్న వాతావరణం, ఎత్తైన కొండ ప్రాంతాల్లో అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా అనుభవించారు. సైన్యంలోకి చేరడానికి ముందు 76 కిలోల బరువున్న ఆయన.. తిరిగొచ్చే సరికి 56 కిలోలకు తగ్గినట్టు గతంలో పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు కూడా.


నానా పటేకర్‌ మృతిపై సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను ప్రత్యేకమైన నటుడిగా కొనియాడుతూ.. నానా పటేకర్‌ వ్యక్తిత్వం, ప్రత్యేక నటనా శైలి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే వ్యక్తి అని ఆయనను గుర్తుచేసుకున్నారు మోదీ. నటుడు అక్షయ్‌కుమార్‌ స్పందిస్తూ.. పటేకర్‌ తన నటనతో ఎలాంటి హంగామా లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే చక్కటి నటుడని అభివర్ణించారు. మరో బాలీవుడ్ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌.. పటేకర్‌ను 'లార్జర్‌ ద్యాన్‌ లైఫ్‌ హీరో' అని కొనియాడారు. తెరపైనే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు నిస్వార్థంగా సేవలందించిన ఆయన మృతి ఓ శకానికి ముగింపు అని పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసన.. మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తిపై దాడి

చనిపోయే ముందు స్నేహితుడికి మెసేజ్ చేసిన నానా పటేకర్.. అందులో ఏముందంటే.?

Updated Date - Oct 08 , 2026 | 04:30 PM