ఓటు చోరీ ఆరోపణలపై మాజీ జడ్జిల ఫైర్.. ఈసీకి మద్దతుగా 42 మంది బహిరంగ లేఖ
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:35 PM
ఓటర్ల జాబితా సవరణ, ఓటు చోరీ ఆరోపణలపై విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 42 మంది మాజీ న్యాయమూర్తులు, రాజ్యాంగ పదవుల్లో విధులు నిర్వర్తించి రిటైర్ అయిన పలువురు ప్రముఖులు ఈసీకి మద్దతుగా నిలిచారు.
ఇంటర్నెట్ డెస్క్: ఓటర్ల జాబితా సవరణ, ఓటు చోరీ ఆరోపణలపై విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. ఎన్నికల సంఘానికి మద్దతు లభిస్తోంది. ఈ మేరకు 42 మంది మాజీ న్యాయమూర్తులు, రాజ్యాంగ పదవుల్లో విధులు నిర్వర్తించి రిటైర్ అయిన పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు. ఈసీ, న్యాయవ్యవస్థ, ఇతర రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. నిన్న(గురువారం) వారు ఓ బహిరంగ లేఖ రాశారు.
'రాజ్యాంగ సంస్థలను విమర్శించడమనేది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కు. అయితే.. వ్యక్తిగత దూషణలు, సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసే ఆరోపణలు చేయడం సరికాదు' అని మాజీ న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఉన్నతస్థాయి అధికారులను బహిరంగ వేదికలపై 'దొంగలు', 'కీలుబొమ్మలు', 'రాజీపడినవారు' అంటూ విమర్శించడం సరికాదన్నారు. 'ఓటు చోరీ' అని ఆరోపిస్తున్న వారు.. వాటిని ఆధారాలతో సహా కోర్టులో ఎందుకు సమర్పించట్లేదని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ప్రమాణపత్రంతో వివరాలివ్వాలని కోరినప్పుడు కూడా.. ఎవరూ స్పందించడం లేదన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పుడు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం, గెలుపొందినప్పుడు వాటి గురించి అసలు ప్రస్తావించకుండా ఉండటాన్ని కూడా వారు తప్పుబట్టారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) అనేది చట్టపరమైన ప్రక్రియలో భాగమేనని మాజీ జడ్జిలు స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 21(3) ప్రకారం.. ఓటర్ల జాబితాలను సవరించే అధికారం ఈసీకి ఉంటుందని గుర్తుచేశారు. చనిపోయిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన పేర్లను, ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారిని జాబితాలోంచి తొలగించడం, అర్హులైన ఓటర్లను కొనసాగించడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. 'సర్'లో నోటీసులు, విచారణ, అభ్యంతరాలు, అప్పీల్‌కు అవకాశం వంటి వెసులుబాట్లు ఉన్నాయన్న వారు.. ఇది పూర్తిగా ఈసీ అధికార పరిధిలోనే ఉందని, సుప్రీంకోర్టు కూడా దీనిని చట్టబద్ధమైనదిగా పరిగణించినట్లు లేఖలో పేర్కొన్నారు.
ఎన్నికల సంస్థలపై పదేపదే అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని మాజీ న్యాయమూర్తులు హెచ్చరించారు. ప్రజలు తమ ఓటుకు విలువ లేదనే పరిస్థితి వస్తే.. ప్రజాస్వామ్యంపై విశ్వాసం తగ్గే ప్రమాదముందన్నారు. ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యంతరాలను ఆధారాలతో సహా ఈసీ, న్యాయస్థానాల ముందుంచాలని సూచించారు. 'ఎన్నికల్లో నిలబడండి.. కానీ ఎన్నికల వ్యవస్థను మాత్రం చెల్లనిదిగా చూపొద్దు' అని కోరారు. నిరాధార ఆరోపణలకు మీడియా కూడా ప్రాధాన్యం ఇవ్వొద్దని ఈ సందర్భంగా మాజీ జడ్జిలు సూచించారు. ఒక విషయాన్ని పదేపదే చెప్పినంత మాత్రాన అది నిజమైపోదన్నారు. రాజ్యాంగ సంస్థలు ఏ ఒక్క ప్రభుత్వానికీ తొత్తులు కావని.. అవి పూర్తిగా దేశ ప్రజలకు సంబంధించినవని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
సినిమాలు పక్కనపెట్టి సైన్యంలోకి.. కార్గిల్ వీరుడిగా నానా పటేకర్
ఈసీపై ఇండియా కూటమి పోరు.. ‘ముందు లంచ్.. తర్వాత నిరసన’ ఫార్ములా!