ఆ 4 రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్!
ABN , Publish Date - Mar 10 , 2026 | 09:25 AM
కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే నాలుగు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. రెండు విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ యోచిస్తున్నట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమబెంగాల్లో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష పూర్తయ్యాక కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) త్వరలోనే 4 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. అసోం, కేరళం, తమిళనాడు, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే ఛాన్స్ ఉంది. దాదాపుగా ఈ వారంలోగా ఈ షెడ్యూల్‌ను ప్రకటించే వీలుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలోని పూర్తిస్థాయి ఈసీ బృందం పశ్చిమబెంగాల్‌లో పర్యటిస్తోంది. అక్కడ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనుందీ బృందం. ఇక.. ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తమిళనాడు, అసోం, కేరళ సహా పుదుచ్చేరిలో ఈసీ ఇప్పటికే పరిశీలన పూర్తిచేసింది. బెంగాల్ సమీక్ష అనంతరం షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం.
అయితే.. ఈ అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించాలని పశ్చిమబెంగాల్‌లో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈసీని కోరారని తెలుస్తోంది. ఈ మేరకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీ, బెంగాల్ సీఈవో మనోజ్ అగర్వాల్‌లు సోమవారం కోల్‌కతాలో పలు పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఆయా పార్టీలు విజ్ఞప్తి చేశాయి. టీఎంసీ, భాజపా, సీపీఎం, కాంగ్రెస్, ఆప్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకముందు సీఈసీని కలిసిన బెంగాల్ భాజపా ప్రతినిధుల బృందం.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు భద్రతా అంశాలపై ఆందోళనలను వ్యక్తంచేస్తూ 16 పాయింట్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది.
ఇవీ చదవండి:
ఢిల్లీ మద్యం స్కాం రౌజ్ ఎవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే
ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..
ఆయుధ దిగుమతుల్లో రెండో స్థానంలో భారత్.. తొలి స్థానంలో ఉక్రెయిన్