Share News

అమెరికా ఆధిపత్య ధోరణి.. ఎన్ఆర్ఐల మౌనమెందుకు?

ABN , Publish Date - Mar 09 , 2026 | 02:03 PM

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుకు భారత్‌కు అనుమతి ఇస్తున్నట్టుగా అమెరికా ఇటీవల ప్రకటించింది. దీనిపై అమెరికా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోందని పలువురు విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా భారతీయ అమెరికన్లు ఎందుకు నోరు మెదపట్లేదని నిలదీస్తున్నారు.

అమెరికా ఆధిపత్య ధోరణి.. ఎన్ఆర్ఐల మౌనమెందుకు?
America dominance over India

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా చమురు సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయం అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు అనుమతి ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. భారత్‌కు పర్మిషన్ ఇవ్వడానికి అమెరికా ఎవరంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.


మరోవైపు.. ఈ విషయంపై అమెరికా విదేశాంగ ఉప మంత్రి క్రిస్టోఫర్ లాండో మాట్లాడుతూ.. అమెరికాకు వాణిజ్య పోటీదారుగా భారత్‌ను ఎదగనివ్వబోమని అన్నారు. '20 ఏళ్ల క్రితం చైనా విషయంలో చేసిన పొరపాట్లనే మళ్లీ చేసి, అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్‌ మాకు పోటీగా ఎదిగే అవకాశం ఇవ్వబోము. నాడు చైనాకు మా మార్కెట్లను స్వేచ్ఛగా వాడుకొనే అవకాశమిచ్చినందుకే నేడు అది మాకు పోటీదారుగా మారింది. మేమేం చేసినా మా ప్రజల కోసమే చేస్తాం. ఎందుకంటే అంతిమంగా మేం అమెరికా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. భారత ప్రభుత్వం భారత ప్రజలకు జవాబుదారీగా ఉన్నట్లుగానే..' అని పేర్కొన్నారు. క్రిస్టోఫర్‌ వ్యాఖ్యాలకు అదే వేదికపై నుంచి భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ శనివారం కౌంటర్‌ ఇచ్చారు. 'భారత ప్రగతిని ఎవరూ ఆపలేరు. ఎవరో చేసే పొరపాట్లపై మనదేశ అభివృద్ధి ఆధారపడి లేదు. భారతదేశ అభివృద్ధి భారత్‌ చేతిలోనే ఉంది. ఆ మాటకొస్తే ఏ దేశ అభివృద్ధి ఆ దేశం చేతిలోనే ఉంటుంది. భారత్‌కు సవాళ్లు లేవని చెప్పను. కానీ, అభివృద్ధి విషయంలో భారత్‌కు లక్ష్యాలు, మార్గం ఉన్నాయి' అని అమెరికా పేరెత్తకుండానే ఆ దేశానికి చురకలంటించారు.


లాండో వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించింది. 'అమెరికా అనుమతితోనే చైనా అభివృద్ధి చెందిందా? భారత్‌ అభివృద్ధి చెందటానికి అమెరికా అనుమతి ఇవ్వదా? అమెరికా ప్రకటన చాలా అయోమయంగా ఉంది' అని చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఎద్దేవా చేసింది. అమెరికా మంత్రి వ్యాఖ్యలపై మనదేశంలో ప్రతిపక్ష పార్టీలు, మేధావులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. దీనిపై అమెరికాలో నివసిస్తున్న భారతీయులు మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదనేది సర్వత్రా ప్రశ్నార్థకమైంది. భారతీయ అమెరికన్లు.. ప్రపంచ ఆర్థిక దృక్పథం కోణంలో దీన్ని అంగీకరించినందునే వారు వాదించలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ, మాతృదేశంపై మరో దేశం ఆధిపత్య ధోరణిని కనబరుస్తున్నప్పుడు కనీసం మద్దతుగా నిలవాలని పలువురు భావిస్తున్నారు. యూఎస్, యూకే సహా ఐరోపా దేశాల్లో భారతీయుల్లో వైట్‌కాలర్ ఉద్యోగులు ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తోన్న కార్మికులూ ఉన్నారు. ఇలా అమెరికా బెదిరింపు ధోరణికి దిగుతున్నప్పుడు ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు స్పందించాలని విశ్లేషకుల అభిప్రాయం.


పాలకుల నిర్ణయమే ప్రధానం..

దీనిపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భాను ప్రకాష్ కోగంటి 'ఎక్స్' వేదికగా స్పందించారు. 'ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా... నాశనం అవ్వాలన్నా... అది ఆ దేశ బహిర్గత శక్తుల వల్ల కాదు. కేవలం ఆ దేశ పాలకులు, ప్రజల ఆలోచనా విధానమే కారణం' అని ఆయన తనదైన శైలిలో రాసుకొచ్చారు. ఆయన మాటల్లోని అంతరార్థాన్ని గమనిస్తే.. ప్రతి దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాలు, ఆర్థిక స్థితిగతులు, అంతర్గత వ్యవహారాలు.. ఆ దేశ ప్రజల ఆలోచనా విధానం, పాలకుల నిర్ణయాలకు సంబంధించినవే. బహిర్గత శక్తుల ప్రభావం.. ఆ దేశ బలాన్ని దూరంగా ఉంచడమే కాకుండా, అంతర్గత మార్పులు, పరిష్కారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫలితంగా.. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, లేదా తిరోగమనం వైపు పయనించాలన్నా చివరకు అది ఆ దేశ పాలకుల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.


ఈ విషయమై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ.. మార్చి 8న ప్రచురితమైన ఆంధ్రజ్యోతి సంపాదకీయ వ్యాఖ్యానంలో బహిరంగంగా స్పందించారు. 'రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుకు నెల రోజుల పాటు అనుమతిస్తున్నామని భారతదేశానికి వరం ఇస్తున్నట్టుగా అమెరికా ప్రకటించడం సగటు భారతీయుల మనసును చివుక్కుమనేలా చేస్తోంది. ఒక గణతంత్ర దేశాన్ని మరో దేశం ఇలా సామంత రాజ్యంగా మార్చుకోవడమేమిటి? అని బాధ కలుగుతోంది. ఆయుధ బలంతో విర్రవీగుతున్న అమెరికాకు ఇది తగదు. చలిచీమల చేత చిక్కి చచ్చును మహాసర్పం అన్నట్టుగా బాధిత దేశాలన్నీ ఏకమైననాడు అమెరికా పరిస్థితి ఏమిటో ఆ దేశ ప్రజలు ఆలోచించుకోవాలి. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యవాద పాలకులనే ఎదిరించి నిలిచిన చరిత్ర భారతదేశం సొంతం అని అమెరికా గుర్తించడం ఆ దేశానికే మంచిది!' అని సంపాదకీయ వ్యాసంలో రాసుకొచ్చారు రాధాకృష్ణ.


భారత్ లాంటి స్వతంత్ర దేశంపై..

ఏది ఏమైనా.. భారత్ ఓ స్వతంత్ర దేశం. అంతర్జాతీయ రాజకీయాల్లో తటస్థతను పాటిస్తూ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకునే సంప్రదాయం భారత విదేశాంగ విధానానికి ఉంది. అలాంటి దేశానికి మరో శక్తిమంతమైన దేశం నిర్ణయాలు చెప్పడం ప్రజలలో అసంతృప్తికి దారితీస్తోంది. ఈ ప్రకటన సగటు భారతీయుడి ఆత్మగౌరవాన్ని గాయపరిచేలా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో శక్తిమంతమైన దేశాలు.. తమ ఆధిపత్యం ప్రదర్శించడం కొత్తేమీ కాదు. అయితే ప్రజాస్వామ్య విలువలను ప్రాముఖ్యంగా చెప్పుకునే దేశాలు.. ఇతర దేశాల స్వతంత్రతను గౌరవించడమూ అంతే ముఖ్యమని విశ్లేషకుల మాట. ఆయుధ బలంతో లేదా ఆర్థిక ఆంక్షలతో ఇతర దేశాలపై ఒత్తిడి తేవడం అంతర్జాతీయ సమతుల్యతకు ప్రమాదకరం.


భారత్ వంటి పెద్ద ప్రజాస్వామ్య దేశం తన జాతీయ ప్రయోజనాల ప్రకారం నిర్ణయాలు తీసుకునే హక్కును కలిగి ఉంది. చమురు దిగుమతుల విషయంలోనూ తన ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ప్రపంచ మార్కెట్‌లో ధరల మార్పులు, సరఫరా పరిస్థితులు, జాతీయ అవసరాలు వంటివి ఈ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో ఇతర దేశాల ప్రకటనలు.. అనవసర అపార్థాలకు దారితీయవచ్చని విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ సంబంధాలు పరస్పర గౌరవం, సహకారం మీద ఆధారపడాలి. ఒక దేశం మరొక దేశానికి మార్గనిర్దేశం చేసే విధంగా వ్యాఖ్యలు చేయడం దౌత్యపరంగా సరైన సంకేతాలు ఇవ్వదని వారు సూచిస్తున్నారు.


ఇవీ చదవండి:

భారత్‌లో 4 వేల కోట్ల లీటర్ల చమురు నిల్వలు.. ఎన్ని రోజులకు సరిపోతాయి..

క్రూడ్ ఆయిల్ పరిస్థితిపై భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది: జై శంకర్

లిక్కర్ పాలసీ కేసు.. సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే

Updated Date - Mar 09 , 2026 | 04:08 PM