జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల.. మే 17న పరీక్ష
ABN , Publish Date - Mar 09 , 2026 | 09:23 AM
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదలైంది. జేఈఈ మెయిన్స్ తుది విడత ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక ఐఐటీలలో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ విడుదలైంది. మే 17న ఈ పరీక్షను నిర్వహించనున్నట్టు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) రూర్కీ షెడ్యూల్లో పేర్కొంది. ఇక.. సంబంధిత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23న ప్రారంభం కానుంది. అంటే జేఈఈ మెయిన్స్ తుది విడత ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి. అయితే.. విదేశీ విద్యార్థుల దరఖాస్తులను మాత్రం ఏప్రిల్ 6 నుంచే స్వీకరించున్నారు. మే 2 వరకు తుది గడువు విధించారు. అభ్యర్థులు jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 17న ఆన్‌లైన్ మోడ్‌లో 2 పేపర్లకు 2 షిఫ్టుల్లో జరుగుతుంది. పేపర్ 1 ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించనున్నారు. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతుంది. జూన్ 1న ఉదయం 10:00 గంటలకు ఫలితాలు వెల్లడికానున్నాయి. జూన్ 2 నుంచి జోసా(జాయింట్ సీట్ అల్లోకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన వారికి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఏఏటీ 2026) రాసేందుకు జూన్ 1న ఉదయం 10:00 గంటల నుంచి జూన్ 2న సాయంత్రం 5:00 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశముంటుంది. ఏఏటీ 2026 పరీక్ష జూన్ 4న ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు జరుగుతుంది. జూన్ 7న ఏఏటీ ఫలితాలు విడుదలవుతాయి.
పూర్తి షెడ్యూల్ వివరాలివే..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం:
భారతీయ విద్యార్థులకు - 2026 ఏప్రిల్ 23 నుంచి
విదేశీ విద్యార్థులకు - 2026 ఏప్రిల్ 6 నుంచి
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 2026 మే 2
అడ్మిట్ కార్డులు: మే 11 నుంచి మే 17 వరకు
పరీక్షా తేదీ: 2026 మే 17 (రెండు షిఫ్టుల్లో)
ఫలితాల విడుదల: జూన్ 1న ఉదయం 10 గంటలకు
జోసా (JoSAA) కౌన్సెలింగ్ ప్రారంభం: జూన్ 2 నుంచి
ఏఏటీ 2026 రిజిస్ట్రేషన్: జూన్ 1న ఉదయం 10 నుంచి జూన్ 2న సాయంత్రం 5 వరకు
ఏఏటీ 2026 పరీక్ష: జూన్ 4
ఏఏటీ 2026 ఫలితాల విడుదల: జూన్ 7
అర్హత ప్రమాణాలు:
జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ ఆధారంగా (జేఈఈ మెయిన్స్ 2026 పేపర్ 1లో టాప్ 2,50,000 మందిలో ర్యాంక్ పొందిన అభ్యర్థులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు నమోదు చేసుకోవడానికి అర్హులు)
ఒక్కో అభ్యర్థి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను గరిష్ఠంగా రెండుసార్లు రాయవచ్చు. ఆ రెండు ప్రయత్నాలూ వరుసగా రెండేళ్లు అయి ఉండాలి.
అర్హత: అభ్యర్థులు 2025 లేదా 2026లో మొదటిసారి 12వ తరగతి(లేదా తత్సమానం)కి హాజరై ఉండాలి. వారు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం సబ్జెక్టులను తప్పనిసరిగా చదివి ఉండాలి.
గతంలో ఏదైనా ఐఐటీలో ప్రవేశం పొందిన అభ్యర్థులు ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరీక్ష రాసేందుకు అనర్హులు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 భారతదేశమంతటా నియమిత కేంద్రాలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT) పద్ధతిలో జరుగుతుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ రెండు భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఇవీ చదవండి:
రాష్ట్రపతిని అవమానించింది మీరే
ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం