Share News

అదనపు చమురుపై దృష్టి

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:58 AM

పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతోంది. ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో ఊహించలేని పరిస్థితి. ఒకవేళ యుద్ధం మరికొంత కాలం కొనసాగితే ముడిచమురు సరఫరాలు తగినంతగా ఉండేలా చూసుకునేందుకు భారతీయ.....

అదనపు చమురుపై దృష్టి

  • అమెరికా, రష్యా, పశ్చిమాఫ్రికా నుంచి సరఫరా కోసం భారత రిఫైనరీల చర్చలు

  • పశ్చిమాసియాలో యద్ధం కొనసాగుతున్నవేళ చర్యలు

  • రష్యా ఆయిల్‌ కొనుగోళ్లను మొదలుపెట్టిన భారత రిఫైనరీలు

న్యూఢిల్లీ, మార్చి 8: పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతోంది. ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో ఊహించలేని పరిస్థితి. ఒకవేళ యుద్ధం మరికొంత కాలం కొనసాగితే ముడిచమురు సరఫరాలు తగినంతగా ఉండేలా చూసుకునేందుకు భారతీయ రిఫైనరీలు చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికా, రష్యా, పశ్చిమాఫ్రికా నుంచి అదనపు ముడిచమురు కోసం కంపెనీలు చర్చలు మొదలుపెట్టినట్టు పరిశ్రమ అధికారులు, విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ముడిచమురును పెట్రోల్‌, డీజిల్‌గా మార్చే ఈ రిఫైనరీలు సాధారణంగా నిర్వహణ కోసం చేపట్టే షట్‌డౌన్‌లను వాయిదా వేసి ప్రాసెసింగ్‌ను కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో దేశ అవసరాలను తీర్చడానికి వీలుగా నిల్వలను సృష్టించడంపై కంపెనీలు దృష్టిపెట్టినట్టు చెప్పారు. మన దేశం ముడిచమురు అవసరాలను తీర్చుకోవడానికి దాదాపు 88శాతం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఫిబ్రవరిలో ఈ సరఫరాల్లో దాదాపు సగం హోర్ముజ్‌ జలసంధి ద్వారానే వచ్చాయి. అయితే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు, ఇరాన్‌ ప్రతిదాడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హోర్ముజ్‌ ద్వారా వెళ్లే నౌకలపై దాడుల నేపథ్యంలో ఈ వ్యూహాత్మక జలసంధి గుండా ట్యాంకర్ల రవాణా దాదాపుగా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అయితే జలసంధియేతర మార్గాలు పూర్తిగా పని చేస్తున్నాయని, ఘర్షణేతర ప్రాంతాల గుం డా మరింత ఎక్కువ సరఫరాలను సమకూర్చుకుంటున్నట్టు చమురు మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి అధికారి ఒకరు పేర్కొన్నారు. 2025లో జలసంధియేతర మార్గాల ద్వారా సరఫరాల వాటా 60శాతం ఉండేదని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అది 70శాతానికి పెరిగిందని చెబుతున్నారు. భారతీయ రిఫైనరీలు పశ్చిమాఫ్రికా, లాటిన్‌ అమెరికా, అమెరికా నుంచి ముడిచమురును సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రష్యా చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా 30 రోజులు వెసులుబాటును కల్పించడం మరో మార్గంగా మారిందని, రష్యా చమురు భారత్‌కు రావడానికి ఇప్పటికే నౌకల్లో లోడ్‌ అయిందని పేర్కొన్నారు. భారతీయ రిఫైనరీలు రష్యా ఆయిల్‌ను కొనడం ప్రారంభించినట్టు పరిశ్రమవర్గాలు తెలిపాయి. రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్‌, లుకోయిల్‌పై గత ఏడాది అమెరికా ఆంక్షలు విధించడంతో రష్యా ముడిచమురును కొనడాన్ని రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హెచ్‌పీసీఎల్‌-మిట్టల్‌ ఎనర్జీలు నిలిపివేశాయి. అయితే ఈ కంపెనీలు ఇప్పుడు రష్యా కార్గోల కోసం మార్కెట్‌కు వచ్చినట్టు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది అమెరికా ఆంక్షలు విధించడానికి ముందు రష్యా ముడిచమురును రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ ఎక్కువగా కొనేది. కాగా రష్యా చమురును కొనడాన్ని భారత్‌ ఎప్పుడూ ఆపలేదని చమురు మంత్రిత్వ శాఖ అధికారి పేర్కొన్నారు. గత నెలలో రోజుకు 1.04 మిలియన్‌ బ్యారెళ్ల రష్యా ముడిచమురును భారత్‌ దిగుమతి చేసుకుంది.

Updated Date - Mar 09 , 2026 | 04:58 AM