Share News

ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:44 AM

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ, ఇరాన్‌ ప్రజలను హత్య చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రటరీ అలీ లారీజానీ హెచ్చరించారు.

ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం

  • ఖమేనీతోపాటు మా దేశ ప్రజల హత్యకు బదులు తప్పదు

  • అనేక మంది అమెరికన్‌ సైనికులను జైళ్లలో పెట్టాం

  • ఇరాన్‌ నేత అలీ లారిజానీ హెచ్చరిక

న్యూఢిల్లీ, మార్చి 8 : ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ, ఇరాన్‌ ప్రజలను హత్య చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రటరీ అలీ లారీజానీ హెచ్చరించారు. ఈమేరకు ఇరాన్‌ అధికారిక టీవీ చానల్‌కి ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖమేనీకి సన్నిహిత సహచరుల్లో ఒకరైన లారిజానీ మాట్లాడుతూ.. ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకొనేంత వరకు నిద్రపోమని హెచ్చరిక జారీ చేశారు. ట్రంప్‌ తమ సుప్రీం లీడర్‌ ఖమేనీతోపాటు తమ దేశ ప్రజలు 1000 మందిని హత్య చేశారని ఆరోపించారు. ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని, చేసిన దానికి ట్రంప్‌ ఫలితం అనుభవించాల్సిందేనని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయని, వారికి భారీ నష్టం కలిగించామని పేర్కొన్నారు. వెనిజులాలో చేసినట్లే ఇరాన్‌తోనూ యుద్ధాన్ని స్వల్ప కాలంలో ముగించుదామని అమెరికా భావించిందని అయితే విఫలమైందని లారిజానీ అన్నారు. కాగా లారిజానీ హెచ్చరికపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందిస్తూ.. తాను దాన్ని పట్టించుకోనని పేర్కొన్నారు. లారిజానీ ఇప్పటికే ఓడిపోయిన వ్యక్తి అని పేర్కొన్నారు. ‘‘ఎవరు అతను...? ఆయన ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియదు... నేను దాన్ని పట్టించుకోను...’’ అని ట్రంప్‌ చెప్పారు. ఇరాన్‌ బేషరతుగా లొంగిపోయే వరకు అమెరికా దాడులు ఆగవని అన్నారు. కాగా లారిజానీ శనివారం తాము అనేక మంది అమెరికన్‌ సైనికులను పట్టుకుని జైళ్లలో పెట్టామని పేర్కొన్నారు. అయుతే అమెరికా దీన్ని తిరస్కరించింది. అవన్నీ అబద్ధాలని పేర్కొంది. మరోవైపు అమెరికా తమ సైనికులు ఆరుగురు మాత్రమే మరణించారని అంటోందని, అయితే ఆ సంఖ్య 500 పైనే అని లారిజానీ ఎక్స్‌లో పేర్కొన్నారు. కాలం గడిచేకొద్దీ ప్రమాదవశాత్తో లేక కల్పిత ఘటనల్లోనూ అమెరికా తన సైనికుల మరణాల సంఖ్యను పెంచుతూ పోతుందని ఎద్దేవా చేశారు. కాగా ఇజ్రాయెల్‌ ఆదివారం ఉదయం ఇరాన్‌ క్రూడాయిల్‌ వసతులపై దాడి చేసింది. వీటిలో టెహరాన్‌లోని షరాన్‌ ఆయిల్‌ డిపో కూడా ఉంది. కాగా తాము బహ్రెయిన్‌లోని అమెరికా జఫెయిర్‌ బేస్‌పై దాడి చేశామని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డులు పేర్కొన్నారు. శనివారం అక్కడి నుంచే తమ డీశాలినేషన్‌ ప్లాంట్‌పై దాడులు జరిగాయని వారు చెప్పారు.

Updated Date - Mar 09 , 2026 | 04:44 AM